నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఏర్పడిన వివాదాన్ని .. ఆ పార్టీ నాయకత్వం అతి కష్టం మీద సర్దుబాటు చేసింది. కోటంరెడ్డిని కొన్నాళ్ల పాటు నియోజకవర్గానికి దూరంగా ఉండమని సూచించి.. ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగేలా చేసింది. అయితే.. ఈ లోపే… కొత్తగా అనంతపురంలోనూ.. నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించేందుకు అనంతపురం జిల్లాకు వెళ్లారు. అక్కడ తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి హంగామా సృష్టించారు. ముఖ్యమంత్రి పర్యటనలో.. ఎక్కడా తన పేరు లేదని.. కనీసం ఆహ్వానించే వారి జాబితాలోనూ తన పేరు చేర్చలేదని.. జిల్లా మంత్రి శంకర్ నారాయణపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇతర నేతలు నేతలు సర్దిచెప్పి.. పక్కకు తీసుకెళ్లారు.
అనంతపురం జిల్లా వైసీపీ నేతల మధ్య… పొసగని పరిస్థితి ఉంది. హిందూపురం, ఉరవకొండ మినహా.. అన్ని నియోజవర్గాల్లోనూ వైసీపీ నేతలే గెలిచారు. దాంతో.. వైసీపీలో నేతలెక్కువైపోయారు. పెత్తనం చేయాలనుకునేవాళ్లు కూడా.. పెరిగిపోయారు. దీంతో.. వైసీపీలో… రచ్చ ప్రారంభమయింది. ఓ నియోజకవర్గ ఎమ్మెల్యే.. మరో నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో సమస్య వస్తోంది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి నిజానికి శింగనమల నియోజకవర్గానికి చెందిన వారు. అలా… తమ తమ నియోజకవర్గాల్లోనూ రాజకీయాలు చేయాలనుకోవడంతోనే సమస్య ప్రారంభమవుతోంది. తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవాలనుకునేవారి సంఖ్య పెరగడంతో… గొడవలు ప్రారంభమవుతున్నాయి.
ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. అన్ని జిల్లాల్లోనూ మెజార్టీ స్థానాలు దక్కించుకుంది. దాంతో… ప్రభుత్వంలో తమదే పైయి అంటే.. తమదే పైచేయి అని… ప్రతీ చోటా రెండు వర్గాలు తయారయ్యాయి. జిల్లా మంత్రులుగా ఎవరున్నప్పటికి.. తమకు హైకమాండ్ వద్ద పలుకుబడి ఉందని.. తాము చెప్పిన మాటే వినాలని.. కొంత మంది జిల్లాల్లో పెత్తనం చేయడం ప్రారంభించారు. వీరికి మంత్రులు, ఇతర పదవులు పొందిన వారు అడ్డం పడుతున్నారు. ఈ క్రమంలో రెండు వర్గాలు… వైసీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పుడు నెల్లూరు తర్వాత అనంత నేతల మధ్య కూడా… వైసీపీ పెద్దలు పంచాయతీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.