వైఎస్ జగన్మోహన్ రెడ్డి… అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో పాలనా వ్యవహారాలపై దృష్టి పెట్టబోతున్నారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గ్రామ వాలంటీర్లతో పాలన క్షేత్ర స్థాయికి వెళ్తుంది. రెండో తేదీ నుంచే.. జగన్.. జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఆ జిల్లాల పర్యటనలకు ఆయన పెట్టిన పేరు రచ్చబండ. అయితే.. ఈ రచ్చబండ కార్యక్రమంలో అసలు విశేషం… వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎక్కడి నుంచి ముగించారో.. అక్కడి నుంచే ప్రారంభించడం. అదే రోజు.. ముహుర్తంగా నిర్ణయించుకున్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి 2009 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాక సెప్టెంబరు 2న రచ్చబండ కార్యక్రమానికి వెళ్లాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. తండ్రి ఎక్కడ అయితే ఆపారో.. తాను అక్కడ్నుంచే ప్రారంభించాలని జగన్ నిర్ణయించుకున్నారు. నిజానికి వైఎస్ హెలికాఫ్టర్ ప్రమాదం జరగడానికి ముండు షెడ్యూల్ ప్రకారం.., అప్పట్లో కాంగ్రెస్ కీలక నేతగా ఉన్న చిత్తూరు జిల్లా నేత.. సైకం జయచంద్రరారెడ్డి .. అలియాస్ సీకే బాబు ఇంటికి వెళ్లి అల్పాహారం తీసుకుని.. ఆ తర్వాత రచ్చబండకు వెళ్లాల్సి ఉంది. కానీ.. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి సీకే బాబు ఇంటికి వెళ్లే అవకాశం లేదు. ఆయనను.. పార్టీ నుంచి తొలగించారు.
సెప్టెంబరు రెండో తేదీన వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా… ముందుగా ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రికి, తన చిన్నాన్న వివేకానందరెడ్డికి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత చిత్తూరు జిల్లాకు వెళ్లి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. నవరత్నాల పథకాల కోసం ఇప్పటి వరకూ.. చట్టాలు, జీవోలు జారీ చేశారు. సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అమలు చేయాల్సి ఉంది. అప్పట్నుంచి పథకాలు డోర్ డెలివరీ చేయబోతున్నారు. మిగతా రత్నాలను అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలకు.. ఇంకా ఏమేం కావాలో తెలుసుకునేందుకు… రచ్చబండను… వైఎస్ జగన్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.