ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మరో పోరాటానికి సిద్ధమౌతున్నారు. తిరుపతి నుంచి సమర శంఖారావం పూర్తిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా వచ్చే అవకాశం ఉంది కాబట్టి, వైకాపా శ్రేణులను కార్యోన్ముఖులను చేయడం కోసమే ఈ సమర శంఖారావం అంటున్నారు. రేపు కడపలో ఒక సభ, 11న అనంతపురంలో, 13న ప్రకాశంలో… ఆ తరువాత, వరుసగా మిగతా జిల్లాల్లో కూడా సమర శంఖారావ సభలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఓరకంగా ఇది ఎన్నికల ప్రచారం అనుకోవాలి. పాదయాత్రకీ సమర శంఖారావానికీ తేడా ఏమైనా ఉందా.. అంటే, ఏం లేదనే చెప్పాలి. అప్పుడూ ఇప్పుడూ ఒకే తరహా సభలూ, ఒకే తరహా విమర్శలూ ఉంటాయి. పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారనీ, ఈ సమర శంఖారావం ద్వారా ప్రభుత్వంపై యుద్ధాన్ని జగన్ తీవ్రతరం చేస్తారని వైకాపా నేతలు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తుంటే… ఇంకా ప్రభుత్వంపై పోరాటం చేస్తారని అనడమేంటో మరి?
ఇంతకీ, ఈ సమర శంఖం దేని మీద… ఎవరి మీద పూరిస్తున్నట్టు..? ఏడాదికి పైగా సాగిన పాదయాత్రలో కూడా ఇలానే పోరాటం పోరాటం అన్నారు కదా. ప్రత్యేక హోదా కోసం పోరాటం అన్నారు! రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాటమన్నారు. అయితే, వైకాపా పోరాటాలు కేవలం జగన్ ప్రసంగాలకు, సభలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి. ఆంధ్రా హక్కుల కోసమే చిత్తశుద్ధిగా పోరాటం చేయాలనుకుంటే… కేంద్రం తీరుపై నిరసన వ్యక్తం చెయ్యాలి. విభజన చట్టాన్ని అమలు చేయని మోడీ సర్కారుపై సమరం చెయ్యాలి. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీ వెళ్లి కూడా… ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఫిర్యాదు చేసి వచ్చారే తప్పితే, హోదా కోసంగానీ ఏపీ హక్కుల కోసంగానీ అక్కడ నిరసన వ్యక్తం చెయ్యలేకపోయారు.
సరే… ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రంలోనైనా వైకాపా ప్రజల తరఫున పోరాడిందా..? అంటే, అదీ లేదనే చెప్పాలి. ప్రజల సమస్యలపై చట్టసభలో పోరాడాలి.. కానీ, అసెంబ్లీ సమావేశాలను గాలికి వదిలేసి, ప్రెస్ మీట్లలో విమర్శలు చేస్తూ కూర్చున్నారు. అధికార పార్టీపై సమరం సాగించాలంటే శాసన సభ వేదికగా జరగాలి, అదీ చెయ్యలేదు. పోనీ, పాదయాత్రలో చేసిన పోరాటాలేంటి… అవీ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఐదేళ్లపాటు అధికారం కోసం ఎదురుచూడటమే వైకాపా చేస్తున్న పోరాటం. ఇప్పుడు కూడా ఈ సమర శంఖారావం ముఖ్యోద్దేశం పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేయడమే… అలాంటప్పుడు, ఇది ప్రజల తరఫున పోరాటం ఎలా అవుతుంది? ప్రజల కష్టాలకు కరిగిపోతే పరిష్కారాలు లభించవు, పోరాడితేనే సమస్యలు తీరుతాయి. జగన్ మాటల్లో సమరం ఉంటుందేమోగానీ, సమస్యలపై పోరాటాలు కనిపించవు అనేది వాస్తవం. ఈ సమర శంఖారావం కూడా అందుకు భిన్నంగా ఉండే ఆస్కారం లేదనేది కొందరి అభిప్రాయం.