ఎట్టకేలకు వైఎస్ఆర్సిపి తాత్కాలిక కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాజధానికి దగ్గరవుతున్నది. ఇప్పటివరకూ బంజారాహిల్స్ లోటస్ పాండ్లోని జగన్నివాసంలోనే కీలకమైన చర్చలూ నిర్ణయాలూ జరిగిన పరిస్థితి కొంతైనా మారేందుకు ఈ పరిణామం దోహదం చేస్తుందేమో చూడాలి. బందరురోడ్లో విచిత్రంగా తెలుగుదేశం కార్యాలయం సమీపంలోనే వైసీపీ కార్యక్షేత్రం రానుండడం విశేషం. జగన్ నివాసం హైదరాబాదులో వుండటం, సాక్షి కార్యాలయం వుండటం, కేసులు, చర్చలు, రాయలసీమ జిల్లాలకు హైదరాబాదు దగ్గరగా వుండటం వంటి కారణాలతో ఇప్పటి వరకూ వైసీపీ కేంద్రం మాత్రం మారలేదు. అమరావతిలో స్థలం లీజుకు తీసుకోవాలనీ, కొనాలనీ చాలా ప్రతిపాదనలు వచ్చినా పెద్దగా ముందుకు నడవలేదు. ఈ పరిస్థితుల్లో బందరురోడ్లో మాజీ మంత్రి పార్థసారథికి సంబంధించిన స్థలంలో వైసీపీ కార్యలయానికి కొద్ది మాసాల కిందట శంకుస్థాపన చేసి నిర్మాణం త్వరగా పూర్తి చేశారు. అయితే ఈ ప్రారంభోత్సవంలో జిల్లా నాయకులే పాల్గొంటారట. రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిశోర్ కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం రాష్ట్రంలో లేకపోవడం సరికాదని గట్టిగా చెప్పారట. నవంబరు నుంచి జగన్ పాదయాత్ర కూడా ప్రారంభం కానుంది. దీని సమన్వయం మొత్తం విజయవాడ నుంచే జరుగుతుందని చెబుతున్నారు. జగన్ కోసం ఒక ప్రత్యేక చాంబర్ ఏర్పాటు చేశారు. ఇలా మూడేళ్ల తర్వాత వైసీపీ కార్యాలయంలో కదలిక రావడం విశేషం.వైసీపీ కార్యక్షేత్రం, రేపటి ఎన్నికల కురుక్షేత్రం ఎపి అయినప్పుడు తెలంగాణ రాజధానిలో కేంద్ర కార్యాలయం వుండటం ఇబ్బంది కరమని ఆ పార్టీ నాయకులే అంగీకరిస్తున్నారు. దీనివల్ల జగన్ను మధ్య మధ్య వచ్చిపోయే నాయకునిగా విమర్శ వచ్చేది.. ఇక ఆయన ఎక్కువ కాలం విజయవాడలోనే వుండి పనిచేసేట్టయితే ఈ విమర్శ వెనక్కు పోవలసి వుంటుంది. ఇప్పటికైతే పాదయాత్రకు బయిలుదేరతారు గనక వుండరనే అనుకోవాలి. ఆరు మాసాలు తనకు కోర్టుకు హాజరునుంచి మినహాయింపు ఇవ్వాలని సిబిఐ కోర్టులోవేసిన పిటిషన్పై తీర్పు ఎలా వుంటుందో కూడా చూడాలి.