జగన్ రెడ్డిని ఆ పార్టీ నేతలు పులకేశి అని అంతర్గత చర్చల్లో పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే అతి నిర్ణయాలతో అందరి జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు. దానికి పర్ఫెక్ట్ సాక్ష్యం టిక్కెట్ల కేటాయింపు. ఓ రకంగా తమ పార్టీ నేతల రాజకీయ జీవితాలతో జగన్ ఓ ఆట ఆడుకున్నారు. ఎక్కడో సిక్కోలుకు చెందిన ఎమ్మెల్యేలకు.. పాయకరావుపేట టిక్కెట్ ఇచ్చారు. సంబంధమే లేని కర్నూలు జిల్లాలోని ఓ రిజర్వుడు నియోజకవర్గానికి ప్రకాశం జిల్లా నేతకు టిక్కెట్ ఇచ్చారు. మంత్రిగా ఉన్న గుంటూరు నేతకు ప్రకాశం జిల్లాలో పడేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే .. కనీసం అరవై మంది నేతల భవిష్యత్‌తో ఎన్నికల సమయంలో ఆటలాడారు.
జగన్ రెడ్డి సముద్రంలో దూకమంటే. దూకేస్తానని రామచంద్రాపురం నుంచి టిక్కెట్ ఖరారు చేసిన తర్వాత కూడా రాజమండ్రి రూరల్ కు పోవాలని ఆదేశించిన తర్వాత చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ అన్న మాటలు అవి. ఆయనకు అప్పుడు అర్థమయిందోలేదో ఆయన జీవితాన్ని జగన్ రెడ్డి నిజంగానే సముద్రంలో ముంచేశాడని. ఆయన బయటకు చెప్పారు కానీ ఎంతో మంది నేతల అభిప్రాయం మనసులో అదే ఉంది. లేకపోతే అసలు జోగి రమేష్‌కు పెనుమలూరుకు ఏంటి సంబంధం?. ఆయన మైలవరంలో పని చేసుకున్నారు. మైలవరం ఖాళీ అయింది. అయినా దాన్ని ఆయనకు ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం యాభై మంది ముఖ్య నేతల జీవితాలతో జగన్ ఫుట్ బాల్ ఆడుకున్నారు.
ఇప్పుడు వారందరికీ తాము పోటీ చేసి ఓడిపోయిన నియోజకవర్గాల్లో పని చేసుకోవాలా.. పాత నియోజకవర్గాలకు వెళ్లాలా అని తెలియక తంటాలు పడుతున్నారు. చాలా మంది తాము పోటీ చేసి ఓడిన నియోజకవర్గాల నుంచి బిచాణా ఎత్తేశారు. తమ పాత నియోజకవర్గాల్లో పని చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని పార్టీని కోరుతున్నా పట్టించుకునేవారే లేరు. ఎప్పుడో ఒక సారి పార్టీ మారిపోతారని ప్రచారం జరిగే వారిని లేదా.. గట్టిగా అడిగేవారికి మాత్రం నియోజకవర్గాలు కేటాయిస్తున్నారు. ఇలాంటి నాయకుడు ఉంటే, .. టార్చర్ కాక ఏముంటుందని ఇతర నేతలు లోపల్లోపల కుమిలిపోతున్నారు.