జీ తెలుగులో ప్రసారం అవుతున్న కామెడీ షో.. అదిరింది. ఈ షోపై జగన్ అభిమానులు ఇప్పుడు గుర్రుగా ఉన్నారు. గత ఆదివారం ఈ షోలో ఓ కామెడీ స్కిట్ ప్రదర్శితమైంది. ఇందులో జగన్ ని ఓ నటుడు ఇమిటేట్ చేయడమే `జగన్ అన్న` అభిమానుల మనోభావాల్ని దెబ్బతీసింది. దాంతో.. ఈ షోలో పాల్గొన్న నటులందరి ఫొటోలు పెట్టి `రిప్` ప్రకటించేశారు ఫ్యాన్స్. అంతే కాదు.. న్యాయ నిర్ణేతల స్థానంలో ఉన్న నాగబాబు, జానీ మాస్టర్లలకు కూడా `శ్రద్దాంజలి` ఘటించేశారు. నిజానికి.. ఇలాంటి స్కిట్లు వేయడం, బడా నాయకుల్ని, హీరోల్నీ ఇమిటేట్ చేయడం కామెడీ షోలలో మామూలే. పైగా జగన్ అభిమానులు మండిపడేంత దారుణమైన సెటైర్లేం ఇందులో లేవు కూడా. ఆ మాట కొస్తే బాలయ్యని కూడా ఇందులో అనుకరించారు. అలిగితే, గిలిగితే.. బాలయ్య ఫ్యాన్సే అలగాలి. ఎందుకంటే ఆయనపైనే ఎక్కువ సెటైర్లు పడ్డాయి. కానీ.. బాలయ్య ఫ్యాన్స్ ఈ షోని లైట్ తీసుకుంటే – జగన్ ఫ్యాన్స్ `లైట్` వేసి మరీ… భూతద్దంలో చూడడం మొదలెట్టారు. ఈ ఛానల్ ని కేబుల్ వాళ్లు ఆపేయాలని, నటీనటులంతా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని జగన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.