ఫిరాయింపుదారుల విషయంలో చాలానే ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతిపక్షంలో కూర్చోలేమన్నట్టుగా అధికార తెలుగుదేశంలోకి వెళ్లిపోవడంతో ఆ స్థానాల్లో నేతల భర్తీకి జగన్ బాగానే ఇబ్బందులు డుతున్నట్టుగా ఉన్నాడు. పార్టీ వీడి వెళ్లిపోయిన ఎమ్మెల్యేల, ఎంపీల స్థానంలో ఆయా నియోజకవర్గాలకు ఇన్ చార్జిలను నియమించే విషయంలో జగన్ కష్టాలు ఎన్నో ఉన్నాయి. అందుకు నిదర్శనం ఒక్కో నేతకు రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పజెప్పుతుండటం.
ప్రధానంగా రాయలసీమలో అయితే వెళ్లిపోయిన వారి స్థానంలో కొత్త వాళ్లను రెడీ చేసుకున్నాడు జగన్. ఈ ప్రాంతంలోని నియోజకవర్గాల్లో పార్టీకి నేతల కొరత లేదు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కూడా ఇబ్బందేమీ లేదు. కానీ మిగిలిన కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో జగన్ పార్టీ బాధ్యతలను అప్పజెప్పడంలో ఇబ్బంది పడుతున్నాడు. కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ నుంచి నేతలను తీసుకొచ్చి ఇన్ చార్జిలుగా ప్రకటిస్తున్నారు.
ఈ విధమైన పరిష్కారం కూడా లేని చోట.. జగన్ పార్టీలోని నేతలకే రెండ్రెండు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగిస్తున్నాడు. తాజాగా అరకు విషయంలో ఇలాగే జరిగింది. ఇక్కడ ఎంపీ కొత్తపల్లి గీత వైకాపాను వీడి తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికలయిన కొంత కాలానికే గీత పార్టీని వీడింది. ఇన్ని రోజులూ ఈ ఎంపీ నియోజకవర్గానికి వైకాపా ఇన్ చార్జి ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో తాజాగా ఆ నియామకం జరిగింది. అరకు ఎమ్మెల్యలే గిడ్డి ఈశ్వరిని జగన్ ఈ ఎంపీ స్థానానికి ఇన్ చార్జిగా నియమించాడు. అంటే చేతిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు అనేక ఎమ్మెల్యే స్థానాలను భాగంగా చేసుకునే ఎంపీ సీటుకు కూడా ఆమెనే ఇన్ చార్జిగా వ్యవహరించనుందనమాట. మొత్తానికి ఫిరాయింపుదారుల లోటు భర్తీ విషయంలో జగన్ అలా ముందుకుపోతున్నాడు!