వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిపోతుందనే.. కృతనిశ్చయంతో ఉన్నారు. అది ఆయన ఆలోచన.. లేక సలహాదారులు ఆయన బుర్రలో పుట్టించారా.. అన్నది ఎవరికీ తెలియదు. ఇప్పుడున్న సలహాదారులు.. ఆయనకు.. గతంలో ఉన్నారో లేదో ..నిజంగానే గతంలో ఆయన సొంత ఆలోచనలు చేశారో కానీ.. రాజధాని విషయంలో ఆయనకో స్పష్టమైన వైఖరి ఉండేది. 2014 ఎన్నికలకు ముందు రాజధాని విషయంలో తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. అదంతా సాక్షి మీడియాలో లైవ్ టెలికాస్ట్ అయింది. నిన్నామొన్నటిదాకా సాక్షి వెబ్సైట్లో ఆ వీడియోలు ఉన్నాయి. కానీ ఇప్పుడు డిలీట్ చేశారు. వైసీపీ కమాండింగ్లో ఉన్న ప్రతీ చోట ఆ వీడియోను తీసేశారు. కానీ సోషల్ మీడియా ఊరుకుంటుందా..? తవ్వుకొచ్చి హైలెట్ చేస్తున్నారు.
అచ్చం అమరావతిలానే నాడు రాజధానిపై జగన్ ఆలోచనలు ..!
చక్కని వాటర్ ఫ్రంట్ కేపిటల్..!
యువతకు ఉపాధినిచ్చేలా పెట్టుబడులు..!
30వేలకుపైగా ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ రాజధాని..!
పాలనా వ్యవస్థలన్నీ ఒకే చోట ఉండాలి..!
ప్రపంచ స్థాయి రోడ్లు, మౌలిక సదుపాయాల కల్పన..!
ఒక్క మాటలో చెప్పాలంటే… వాషింగ్టన్ డీసీని… తెచ్చి పెట్టేయాలన్నంక ఉద్వేగం. ఇదంతా.. చంద్రబాబు కల కాదు.. ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన. 2014లో తనకు తిరుగులేని విజయం ఖాయమనుకున్నారు జగన్. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. హైదరాబాద్‌ను వదులుకున్న ప్రజల్లో.. మనకూ అలాంటి నగరం కావాలనే అభిప్రాయం ఉంది. దీన్ని గుర్తించిన జగన్… రాజధానిపై తన ఆలోచనలను…, ప్రచారం ముగిసిన చివరి రోజు.. ఆవిష్కరించారు. మొత్తం గంటన్నసేపు జరిగిన సాగిన మీడియా సమావేశంలో రాజధాని గురించి ఇరవై నిమిషాలు చెప్పారు. అయన చెప్పినవన్నీ.. ఇప్పుడు అమరావతిలో కనిపిస్తున్నవే. తన ఆలోచనలకు తగ్గట్లుగా ఉన్న అమరావతి నగరాన్ని ఆయన ముందుకు తీసుకెళ్లకుండా గొంతు నులిమేస్తున్నారు.
అభిప్రాయం మార్చుకోవాల్సినంత మార్పు ఏమి వచ్చింది..?
రాజకీయ నేతలు.. రాజకీయ వ్యూహాల పరంగా ఆలోచనలు మార్చుకోవచ్చేమో కానీ.. ఇలా.. అభివృద్ధి పరంగా… రాష్ట్ర భవిష్యత్‌కు విఘాతంగా మారే విషయాలపై అభిప్రాయాలు మార్చుకోవడం ప్రమాదకరం. అ పరిణామాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజధానిపై..జగన్మోహన్ రెడ్డి అభిప్రాయాలు నిన్నామొన్నటిదాకా మారలేదు. దానికి కారణం ఆయన అమరావతిలో ఇల్లు కట్టుకోవడమే నిదర్శనం. అయితే.. అమరావతిపై చంద్రబాబు ముద్ర ఉందనో.. మరో కారణమో కానీ.. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగినా.. సరే.. పాలనను.. విశాఖ నుంచే చేయాలని అనుకుంటున్నారు. నిర్ణయం తీసేసుకున్నారు.
వీడియోలు డిలీట్ చేసుకుని యూటర్న్ తీసుకున్నట్లు అంగీకరించారా..?
జగన్మోహన్ రెడ్డి రాజధాని ఆలోచనలు ఎంతో ఉన్నతమని.. ఆయన అనుచరులు..వైసీపీ నేతలు చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు ఆ ఉన్నతం కాస్తా సంకుచితం అయిందని సిగ్గుపడ్డారో… ఆ ఉన్నతమైన ఆలోచనలు.. ప్రజలు మళ్లీ మళ్లీ వింటే… ఇంత దారుణమైన యూటర్నా..అని అసహ్యించుకుంటారని అనుకున్నారో కానీ.. ఆ వీడియోలన్నింటినీ డిలీట్ చేశారు. కానీ.. ఆ వీడియో.. ఒక్క సాక్షి వెబ్సైట్లోనే.. మరో వైసీపీ అధికారిక మీడియాలోనే డిలీడ్ చేస్తే.. శాశ్వతంగా.. కనిపించకుండా పోదుగా. నెటిజన్లు బయటకు తీసి.. వైరల్ చేస్తున్నారు. సీఎం నాలుక మడతేసి… ప్రజల్ని మోసం చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో కలిగేలా చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి ఏర్పడింది.