ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం జరిగినా… తన తండ్రి తొంభై శాతం పూర్తి చేశారని.. మిగతా పది శాతం పూర్తి చేయడానికి ప్రభుత్వానికి నాలుగేళ్లు పట్టిందని విమర్శిస్తూ..క్రెడిట్ అంతా తన తండ్రికే కట్టబెట్టేస్తూంటారు. ఇప్పుడు ఈ విషయంలో మరో ముందడుగు వేశారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదగడానికి కూడా.. వైఎస్ రాజశేఖర్ రెడ్డినే సాయం చేశారట. రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని తనకిష్టం వచ్చినట్లు వర్ణిస్తూ.. ఎమ్మెల్యే , మంత్రి ఎలా అయ్యారో చెబుతూ వచ్చారు. చంద్రబాబు తొలిసారి మంత్రి అయ్యారని చెబుతూ.. వైఎస్ దయతోనే ఆ పదవి వచ్చిందని చెప్పేశారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డికి, చంద్రబాబుకు మితృత్వం ఉందని అందరికీ తెలుసు. ఇద్దరు ఇరుగు పొరుగు జిల్లాల వారు. ఇద్దరూ ఒకేసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కానీ చంద్రబాబుకు మంత్రి పదవి ఇప్పించేంత పలుకుబడి.. వైఎస్‌కు తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడే వచ్చిందా..? అంత పలుకుబడి ఉంటే.. ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన 1978లోనే మంత్రి పదవి ఎందుకు పొందలేకపోయారు..? ఒక వేళ ఇప్పించి ఉంటే.. వైఎస్ … ఊరుకునేవారా..?. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అధికార పక్షంలో ఉన్నప్పుడు… హంగామా చేసి ఉండేవారు కాదా..?. పోనీ ఈ విషయం జగన్ సినిమాల్లో చూసినట్లు చర్చలు జరుపుతున్నప్పుడు తలుపు సందులోనుంచి చూసి ఇప్పుడు బయటపెట్టారా అంటే.. వైఎస్ తొలిసారి మంత్రి అయినప్పుడు.. జగన్ మూడు, నాలుగేళ్ల పిల్లగాడు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు… యూనివర్శిటి రాజకీయాలతో… యువత కోటాలో తొలిసారి అసెంబ్లీ టిక్కెట్ తెచ్చుకుని.. చాలా చిన్నవయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వైఎస్‌తో అప్పుడే స్నేహం ఏర్పడింది. కానీ వారేమీ సహాధ్యాయులు కాదు. చిన్నతనం నుంచి మిత్రులవడానికి. మొదటి సారి ఎమ్మెల్యే అయినప్పుడు మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేవారు. అప్పుడే నేరుగా వెళ్లి తనకూ మంత్రిపదవి కావాలని అడిగినట్లు చంద్రబాబు చాలా ఇంటర్యూల్లో చెప్పారు. కానీ ఆయన ఇవ్వలేదు. దాంతో చంద్రబాబు మరికొంత మంది ఎమ్మెల్యేలతో కలిసి చెన్నారెడ్డికి వ్యతిరేకంగా నిజామాబాద్ జిల్లాకు చెందిన బీసీ నేత రాజారాంను బలపరిచారు. కానీ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత కొంత కాలానికే చెన్నారెడ్డి అవినీతి ఆరోపణలతో దిగిపోయారు. అంజయ్య సీఎం అయ్యారు. ఆయన 64 మందితో జంబో మంత్రివర్గం ఏర్పాటు చేశారు. అప్పుడే చంద్రబాబుతో పాటు వైఎస్ రాజశేఖరరెడ్డిని కూడా మంత్రి వర్గంలో తీసుకున్నారు.
జరిగింది ఇది కానీ… చంద్రబాబుకు తన తండ్రే తొలిసారి మంత్రి పదవి ఇప్పించినట్లు.. జగన్ చెప్పుకోవడంతో.. టీడీపీ నేతలు ఆశ్చర్యపోయారు. ఏపీలో ఎలాంటి అభివృద్ధి పని జరిగినా.. వైఎస్ చనిపోయిన తొమ్మిదేళ్ల తర్వాత కూడా.. ఆయన పుణ్యమేనని చెప్పుకున్నట్లే.. చంద్రబాబు రాజకీయ జీవితాన్ని కూడా ఆయన తండ్రికే క్రెడిటె కట్టబెట్టేసుకునేందుకు ఏ మాత్రం సంకోచించకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.