ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండటానికి అమరావతిలో అధికారిక నివాసం లేదు. మొదటి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు.. కరకట్టపై.. ప్రైవేటు నివాసంలో ఉన్నారు కానీ.. ముఖ్యమంత్రి కోసం.. బేగంపేటలోని ప్రగతిభవన్‌లా.. ఓ భవనం కడదామన్న ఆలోచన చేయలేదు. దాంతో.. కొత్తగా ముఖ్యమంత్రి అయిన.. జగన్మోహన్ రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆ ఇబ్బందులు ఇప్పటికే రూ. పది కోట్ల ప్రజాధనానికి టెండర్ పెట్టాయి.
జగన్ ఇంటి కోసం రూ. 10 కోట్లకుపైగా ఖర్చు..!
జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఓ ఇంటిని నిర్మించుకున్నప్పటికీ.. సరైన సౌకర్యాలు లేక ఇబ్బందిపడుతున్నారు. ఆయన ఇంటితో పాటు క్యాంప్ ఆఫీస్‌ను కూడా కట్టుకున్నారు. ఇంటీరియర్.. ఏమీ లేకుండానే గృహప్రవేశం చేశారు. అక్కడ సౌకర్యాలేమీ లేవు. కనీసం ఓ బాత్రూమ్ను కూడా కట్టలేకపోయారు. ఇప్పుడు అధికారులు అఘమేఘాలపై.. ఆ ఇంటి కోసం కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. గత నెల కాలంలో.. జగన్ నివాసానికి రోడ్డు, ఇంట్లో సౌకర్యాల కోసం… కనీసం రూ. పది కోట్లకుపైగానే వెచ్చించారు. ఇంకా.. కొన్ని పనులు ప్రతిపాదనల్లో ఉన్నాయి.
ప్రజాధనంతో ప్రైవేటు ఆస్తికి ముస్తాబులా..?
జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇంటికి 1.3 కిలోమీటర్ల రోడ్డు వేయడానికి రూ. ఐదు కోట్లు మంజూరు చేశారు. ఆదే సమయంలో.. ఓ బాత్రూమ్ నిర్మాణానికి రూ. 30 లక్షలు, హెలిప్యాడ్.. ఇతర అవసరాలకు రూ. రెండు కోట్లు విడుదల చేశారు. ఆ తర్వాత రెండు వారాల కిందట.. జగన్ ఇంట్లో ఎలక్ట్రికల్ మెయినటనెన్స్ కోసం.. రూ. 90 లక్షలు విడుదల చేశారు. అవి అలా నడుస్తూండగానే.. తాజాగా జగన్ ఇంట్లో ఏసీలు, ఇతర ఎలక్ట్రికల్ పనుల కోసం.. దాదాపుగా రూ. 3 కోట్ల 63 లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేశారు. ఇవన్నీ ముఖ్యమంత్రి ప్రైవేటు ఆస్తికి మెరుగులు దిద్దడానికే. జగన్ ఇప్పుడు ఉంటున్న ఇల్లు ప్రభుత్వ ఆస్తి కాదు.
ఆ డబ్బులు పెట్టి సీఎం శాశ్వత గృహం నిర్మించవచ్చుకదా..!?
ఆ కోట్లు పెట్టి.. ప్రభుత్వం భూసమీకరణ చేసిన ప్రాంతంలో.. ముఖ్యమంత్రి కోసం..ఓ విశాలమైన ఇంటిని కడితే.. ప్రభుత్వ ఆస్తిగా.. తర్వాత వచ్చే ముఖ్యమంత్రులు ఉండటానికి కూడా శాశ్వతంగా ఉండిపోతుంది. కానీ ఇప్పుడు అధికారులు మాత్రం కోట్లు ఖర్చు పెట్టేసి.. జగన్ ప్రైవేటు నివాసానికి ముస్తాబులద్దుతున్నారు. ఇది విమర్శలకు తావిస్తోంది. ముఖ్యమంత్రి ఇలా తన ఇంటిని ప్రజాధనంతో మౌలిక సదుపాయాలు కల్పించుకోవడం ఏమిటన్న చర్చ వస్తోంది. కానీ ఇప్పుడు సర్కార్‌కు.. అధికారులకు వాటిని ఆలకించే తీరిక లేదు.