ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అడుగు బయటపెడితే హెలికాఫ్టర్‌ను మాత్రమే వాడుతున్నారు. దూరం ఎంత అన్నదానితో పట్టింపు లేదు. కొత్త ఏడాదిలో ఆయన పెన్షన్లను పెంచే పథకం ప్రారంభానికి పెదనందిపాడు వెళ్లారు. తాడేపల్లి నుంచి పెదనందిపాడుకు యాబై కిలోమీటర్లు కూడా ఉండదు. కానీ ఆయన హెలికాఫ్టర్‌లో వెళ్లారు. సీఎం కాబట్టి రూట్ క్లియర్ చేస్తే అరగంటలో వెళ్లిపోతారు. కానీ జగన్ మాత్రం హెలికాఫ్టర్ రైడ్‌కే ప్రాధాన్యం ఇచ్చారు. హెలిప్యాడ్‌ను వేదిక వద్ద నుంచి రెండు కిలోమీటర్ల అవతల ఏర్పాటు చేశారు. ఈ రెండు కిలోమీటర్ల దూరం బారికేడ్లు పెట్టారు.
అప్పుడే… తాడేపల్లి టు పెదనందిపాడు హెలికాఫ్టర్ వాడినందుకు సోషల్ మీడియాలో సెటైర్లు పడ్డాయి. ఈ రోజు మరింత డిస్టెన్స్ తగ్గించుకున్నారు సీఎం జగన్. గుంటూరు నగరంలో ఐటీసీ హోటల్‌ను ప్రారంభించేందుకు ఆయన వెళ్లారు. ఖచ్చితంగా ముఫ్పై కిలోమీటర్ల దూరం. జాతీయ రహదారి. రోడ్డెక్కితే ఖచ్చితంగా పావుగంటలో కాన్వాయ్‌తో సహా గుంటూరు చేరుకోవచ్చు. కానీ ఆయన హెలికాఫ్టర్‌లోనే గుంటూరు వెళ్లారు. ప్రోగ్రాం ముగించుకుని తిరిగి వచ్చారు. ఇంత మాత్రం దానికి కూడా హెలికాఫ్టర్ వాడతారా అని చాలా గుంటూరు జనం కూడా ఆశ్చర్యపోయే పరిస్థితి. అయితే సీఎం జగన్‌ది లగ్జరీ కాదని కొంతమంది చెబుతున్నారు. సెక్యూరిటీ రీజనేనని అంటున్నారు.
కాన్వాయ్‌కు ఎవరైనా అడ్డం పడతారేమోనని.. అలాంటిచాన్స్లు ఇవ్వకూడదన్న ఉద్దేశంతోనే హెలికాఫ్టర్ వాడుతున్నారంటున్నారు. అప్పటికీ జగన్‌కు గుంటూరులో కొంత మంది వైసీపీ నేతలు ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారు. పార్టీలో చాలా కాలం పని చేస్తున్నా పట్టించుకోవడం లేదని.. సీఎంను కలిసి చెప్పుకుంటామని కొంత మంది నేతలు దూసుకొచ్చారు. వారందర్నీ పోలీసులు కంట్రోల్ చేశారు. మొత్తంగా జగన్ తిరిగితే గాల్లో తిరగాలి.. లేకపోతే బారీకేడ్లు పరదాలు పెట్టి పయనించాలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. దీన్ని విపక్షాలు విమర్శించకుండా ఉంటాయా..?