దేశంలో దళితులపై దాడులు జరుగుతుండటం చాలా బాధాకరమే అందరూ గట్టిగ ఖండించవలసిందే. దళితులపై దాడులకి పాల్పడుతున్న దోషులని కటినంగా శిక్షించవలసిందే. దీనిపై దేశంలో అధికార, ప్రతిపక్షాలలో కూడా భిన్నాభిప్రాయం లేదు. కానీ ప్రతిపక్షాలు ఇటువంటి సంఘటనల నుంచి కూడా రాజకీయ మైలేజ్ కోసం తాపత్రయపడుతుండటం చూసి ప్రజలు కూడా అసహ్యించుకొంటున్నారు. గుజరాత్ లో ‘ఉన’ పట్టణంలో దళితులపై దాడి జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్ నుంచి బీ.ఎస్.పి. అధినేత్రి మాయావతి అక్కడ వాలిపోయారు. వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని, యూపిలో దళిత ఓటు బ్యాంక్ ని తనవైపు త్రిప్పుకోనేందుకే ఆమె వచ్చి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో సుదాపాలెం గ్రామంలో కూడా ఇద్దరు దళితులపై దాడులు జరిగినప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాలు కూడా అదేవిధంగా వ్యవహరించాయి. కానీ ఆ దాడికి రాజకీయాలతో ఎటువంటి సంబంధమూ లేదని గ్రహించిన తరువాత వెనక్కి తగ్గాయి. కానీ వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆ దాడికి గురైన ఇద్దరు బాధితుల్ని పరామర్శించేందుకు ఈరోజు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్నారు. ఆయన కేవలం పరామర్శకే పరిమితం అయితే ఎవరూ ఆయనని వేలెత్తి చూపరు. కానీ ఆ సాకుతో యధాప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయకుండా ఉండరు.కనుక ఆయన పరామర్శ యాత్రని రాజకీయ కోణంలో నుంచే చూడవలసి ఉంటుంది.
జగన్ పర్యటన ప్రధానోద్దేశ్యం రాష్ట్రంలో శాంతిభద్రతలని అదుపుచేయడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని ఆరోపించడం, దళిత ఓటు బ్యాంక్ ని ఆకట్టుకోవడం. మొదటిపని ఆయన చేతిలోనే ఉంది కనుక సాక్షి మీడియా సాక్షిగా చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరుగవచ్చు. కానీ ఈ పర్యటనతో దళితులని ఆకట్టుకోగలరా లేదా అనేది తెలియాలంటే వచ్చే ఎన్నికల వరకు ఆగాలి. రాజకీయాలలో నైతిక విలువలపై పేటెంట్ హక్కు కలిగినట్లు మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి కుళ్ళు రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో?