కర్నూలులో ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓదార్చారు. తుంగభద్ర పుష్కరాల కోసం కర్నూలు వెళ్లిన జగన్.. సలాం కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ప్రత్యేకంగా సమయం కేటాయించారు. వారికి గతంలో ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. సలాం భార్యా, పిల్లలతో పాటు అందరూ చనిపోవడంతో… సలాం అత్తకు రూ. ఇరవై లక్షల నష్టపరిహారం చెక్కును అందించే ప్రయత్నం చేశారు. కానీ అప్పట్లో తీసుకోలేదు. దాంతో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రూ. పాతిక లక్షల చెక్‌ను అందించారు. సలాం కుటుంబ ఆత్మహత్యకు కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు.
ఆ తర్వాత సలాం అత్త కొన్ని విజ్ఞప్తులను జగన్‌కు చేశారు. తన మరో కుమార్తెకు ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇవ్వాలని..అనంతపురంలో ఉద్యోగం చేస్తున్న అల్లుడిని నంద్యాలకు బదిలీ చేయాలని కోరారు. వెంటనే.. ఆ విజ్ఞప్తులను పరిష్కరించాలని జగన్ అధికారులను ఆదేశించారు. సలాం అత్త కుటుంబానికి అండగా ఉండాలని అక్కడిక్కడే ఎస్పీ ఫక్కీరప్పను జగన్ ఆదేశించారు. సలాం కుటుంబం మొత్తం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది రోజుల తర్వాత పోలీసుల వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా వారి వాంగ్మూలం వీడియో బయటకు వచ్చింది. దాంతో రాజకీయంగా ప్రకంపనలు ప్రారంభమయ్యాయి.
మైనార్టీల్లో ఈ వ్యవహారం అలజడి రేపడంతో ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారు. తానే స్వయంగా సలాం కుటంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పోలీసుల్ని అరెస్ట్ చేయించారు. వారు బెయిల్ పై వచ్చినందున .. బెయిల్ రద్దు చేయించేందుకు పిటిషన్లు వేయించారు. జగన్ చర్యలతో ముస్లింలు సంతృప్తి పడతారని వైసీపీ వర్గాలు భావిస్తున్నారు.