జగన్ రెడ్డి ఓ ఎమ్మెల్యేను పిలిపించారు. సర్వేల్లో నీ పరిస్థితి ఏమీ బాగోలేదయ్యా… ఏం చేద్దాం అని అడిగారు. నీ పరిస్థితేమైనా బాగుందా…. అని ఆ ఎమ్మెల్యే రివర్స్ లో ప్రశ్నించారు. నీ మీద నియోజకవర్గంలో వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెబుతున్నానని జగన్ రెడ్డి కాస్త మృదువుగానే ప్రశ్నించారు. నా మీద ఎందుకు వ్యతిరేకత… నేనేమీ మర్డర్లు చేయలేదు.. మర్డర్లు చేసిన వారిని వెనకేసుకు రాలేదని ఆ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. దీంతో జగన్ రెడ్డి మొహంలో రంగులు మారిపోయాయి. వెంటనే పరిస్థితిని గమనించిన వైవీ సుబ్బారెడ్డి అక్కడ్నుంచి ఆ ఎమ్మెల్యేను బ యటకు తీసుకెళ్లిపోయారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఓ ఎమ్మెల్యే వన్ టు వన్ లో జరిగింది ఇది.
ఆ ఎమ్మెల్యే సీఎం సొంత జిల్లాలో అత్యంత సన్నిహితుడు.. అంటే రాయచోటి ఎమ్మెల్యే గడి కోట శ్రీకాంత్ రెడ్డినే. ఆయనే జగన్ రెడ్డికి మిత్రుడు. కానీ ఇటీవల ఆయన పెద్దగా కనిపించడం లేదు. కాంగ్రెస్ లోకి వెళ్తారన్న రూమర్స్ కూడా వచ్చాయి. కానీ అవి వైసీపీ క్యాంప్ పుట్టించిందని శ్రీకాంత్ రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. ఇలాంటి సమయంలో ఆయనను పిలిచిన జగన్ రెడ్డి నీ మీద వ్యతిరేకత ఉందని చెప్పడంతో కోపం తెచ్చుకున్నారు. జగన్ రెడ్డి గురించి మొత్తం తెలుసు కాబట్టి.. ఫైర్ అయ్యారు. టిక్కెట్ ఎవరికి ఇచ్చుకుంటావో ఇచ్చుకో అని సవాల్ చేసి వెళ్లిపోయారు. ఈ వ్యవహారం ఇప్పుడు వైసీపీలో కడప జిల్లా రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
నిజానికి ఎమ్మెల్యేలందరితోనూ అదే బాధ ఉంది. తమపై వ్యతిరేకత ఉందని జగన్ రెడ్డి పిలిచి చెబుతున్నారు కానీ.. అసలు ఈ ఐదేళ్లలో వాలంటీర్లే బెటరన్నట్లుగా సాగిన పాలనలో తమపై వ్యతిరేకత ఎందుకు వస్తుందని.. ఏదైనా తానే అన్నట్లుగా వ్యవహరించే జగన్ రెడ్డిపైనే వ్యతిరేకత ఉంటుంది కదా అని ప్రశ్నిస్తున్నారు. కానీ బయటకు చెప్పలేకపోతున్నారు. కొంత మంది మాత్రం బయటపడుతున్నారు. అలాంటి వారిలో శ్రీకాంత్ రెడ్డి నేరుగా జగన్ రెడ్డి ముందే స్పష్టం చేశారు.
జగన్ రెడ్డి టిక్కెట్ల కసరత్తులో ఏం జరుగుతుందో.. ఆయన ఏం చెబుతున్నారో.. ఇతరులు ఏం సమాధానాలు చెబుతున్నారో మక్కీకి మక్కీ బయటకు వస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఎంఎస్ బాబుతో జగన్ రెడ్డి ఏం మాట్లాడారో మొత్తం బయటకు వచ్చింది. పేపర్లో వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఆయన అదే చెప్పారు. మరో వైపు కృష్ణజిల్లా నేత పార్థసారధితో జగన్ చేసి చేసిన మనసు చూరగొనే సంభాషణ కూడా వైరల్ అయింది. ఇప్పుడు.. శ్రీకాంత్ రెడ్డితో జగన్ రెడ్డి సంభాషణ కూడా అంతే వైరల్ అవుతోంది. మొత్తంగా జగన్ రెడ్డిని కామెడీగా తీసుకునే వైసీపీ నేతల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.