బొత్స సత్యనారాయణ సేవలు చాలని ఆయన రిటైర్ అయితే ఆయన వారసత్వాన్ని ఆయన మేనల్లుడు చిన్న శీనుకు ఇస్తానని జగన్ సంకేతాలు పంపుతున్నారు. తాజాగా వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త బాధ్యతలను కురసాల కన్నబాబుకు ఇచ్చారు. దాంతో బొత్స వర్గానికి షాక్ తగిలినట్లయింది. అసలు కన్నబాబు ఉన్న రాజకీయ అనుభవం ఎంత.. బొత్స లాంటి నేత ఉన్న ప్రాంతానికి పార్టీ ఇంచార్జ్ గా నియమించడం ఏమిటన్న అసహనం వ్యక్తమవుతోంది.
ఉత్తరాంధ్ర అంతా తన కనుసన్నల్లో ఉండాలనుకుంటున్న బొత్స
బొత్స సత్యనారాయణ ఉత్తరాంధ్ర వైసీపీ మొత్తం తన కనుసన్నల్లో ఉండాలని.. తాను ఏం చెబితే అది జరగాలని అనుకుంటున్నారు. అయితే జగన్ మాత్రం అలాంటి చాన్సివ్వడం లేదు. ఆయనకు గోదావరి జిల్లాల బాధ్యతలిచ్చారు. కానీ ఆయన పట్టించుకోవడంలేదు. విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఓ సారి మీడియా ప్రతినిధులు ఇక వైసీపీ ఉత్తరాంధ్ర ఇంచార్జ్ మీరేనా అని అడిగితే.. ఆ పదవేమైనా బంగారమా అని వ్యాఖ్యానించారు. కానీ ఆయన ఉద్దేశం ఏమిటో మీడియా ప్రతినిధులకు తెలుసు కాబట్టే ఆ ప్రశ్న అడిగారు.
బొత్సకు బదులుగా మేనల్లుడికి ప్రోత్సాహం
బొత్స మేనలుడు చిన్న శ్రీను నేరుగా జగన్ తో టచ్ లో ఉంటున్నారు. గత ఎన్నికల్లోనే ఆయన చీపురుపల్లి నుంచి పోటీ చేయాలనుకున్నారు. జగన్ ద్వారా బొత్సకు చెక్ పెట్టాలని అనుకున్నారు. బొత్స రిటైర్మెంట్ అనే లీకులు వైసీపీ నుంచి వచ్చాయి. ఆయన భార్యకు ఎంపీ స్థానం ఇచ్చి బొత్సను సైలెంట్ చేస్తారని అనుకున్నారు. అయితే బొత్స అడ్డం తిరిగారో లేకపోతే చిన్న శీనే ఈ సారి వద్దలెండి అని అన్నారో కానీ.. మళ్లీ బొత్సకే చాన్స్ ఇచ్చారు. అక్కడ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు బొత్స మేనల్లుడు భీమిలీ నియోజకవర్గ ఇంచార్జ్. విజయనగరంలో ఆయన చెబితేనే ఇంచార్జుల్ని మారుస్తున్నారు.
సమయం కోసం ఎదురుచూస్తున్న బొత్స
బొత్స సత్యనారాయణ కూడా సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంతో ముఖ్యమైతే తప్ప ఆయన తాడేపల్లి వైపు చూడటం లేదు. ముఖ్యనేతల సమావేశం అని పిలిచినా వెళ్లడం లేదు. వీలైనంత వరకూ దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రెస్మీట్లు పెట్టి ఏం మాట్లాడుతున్నారో తెలియనట్లుగా మాట్లాడుతున్నారు. బొత్స సరైన సమయం కోసం చూస్తున్నారన్న అభిప్రాయం వైసీపీలోనే ఉంది.