వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. పులివెందులలో పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచి.. తన స్పీచ్‌లో కానీ.. బాడీ లాంగ్వేజ్‌లో కానీ.. ఆ కుడి చేయినా .. 360 డిగ్రీల కోణంలో.. విసురుగా పైకి తీసుకెళ్లడంలో కానీ.. ఇసుమంత మార్పు రాలేదు. ప్రతీ సారి స్పీచ్ ముగించే ముందు రాజకీయ వ్యవస్థలో మార్పులు తెస్తానంటారు. ప్రజలందరి మద్దతు కావాలంటారు. జగన్ రాజకీయ వ్యవస్థలో తెచ్చే మార్పులేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అంటే.. కేంద్ర అమలు చేయాల్సిన విభజన హామీల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని తిట్టడమా..?. ఏటీఎంలలో డబ్బులు రాకపోయినా చంద్రబాబునే తప్పని విమర్శించడమా..?. జగన్ సీఎం కాకపోవడం వల్ల ప్రజలంతా.. విషాదంలో ఉన్నారని… చెప్పుకోవడమా..?. ఏ చిన్న కష్టం వచ్చినా చంద్రబాబును బాధ్యతపై నెట్టేయడమేనా.. కొత్త రాజకీయ వ్యవస్థ.
హామీలు నెరవేర్చకపోతే.. రాజీనామాలు చేసి వెళ్లిపోయేలా.. వ్యవస్థ తెస్తానంటారు జగన్. జగన్ దృష్టిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మినహా.. దేశంలో ఏ ఒక్క నేత కూడా హామీలు అమలు చేయలేదు. చివరికి సోనియాగాంధీ కూడా. తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తామనే హామీ ఇవ్వకపోయినా.. పదవి ఇవ్వనందుకు ఆమె కూడా.. ద్రోహినే. ఇక చంద్రబాబు అయితే ఒక్క హామీని కూడా అమలు చేయలేదని చెబుతూంటారు. కానీ ప్రభుత్వం అన్ని హామీలు అమలు చేసేశాం.. ఏ హామీని అమలు చేయలేదో చెప్పమని డిమాండ్ చేస్తున్నారు. రుణమాఫీ జరగలేదని జగన్ ఆరోపిస్తారు. జరిగిందని లెక్కలు చెబుతుంది టీడీపీ. మరి హామీని అమలు చేశారో లేదో ఎవరు డిసైడ్ చేస్తారు. జగన్ కొత్త రాజకీయ వ్యవస్థ ఎలా వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కట్టలు తెంచిన రాజకీయ నేత రాజశేఖర్ రెడ్డి. రెండోసారి గెలిచినప్పుడు.. అత్యల్ప మెజార్టీ రావడంతో… ఇతర పార్టీలపై పగబట్టినట్లు.. విరుచుకుపడ్డారు. వచ్చిన వారిని వచ్చినట్లు కలిపేసుకున్నారు. అలాంటి రాజకీయ వ్యవస్థ తెస్తారా..? . ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పప్పు బెల్లాలు వేసి… ప్రజల ఆస్తులను తన సొంత సొమ్ముల్లా .. కంపెనీలకు కట్టబెట్టి.. పెట్టుబడుల రూపంలో లంచాలు తీసుకునే వ్యవస్థను చట్టబద్ధం చేస్తారా..? లేక బలం ఉన్నవాడితే సీటని… తన సామాజివర్గానికే ఇప్పట్లాగే పెద్దపీట వేస్తారా..?. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. అత్యంత సీరియస్‌గా చేసే ప్రసంగాల్లో కొత్త రాజకీయ వ్యవస్థ ఎప్పుడూ ఉంటుంది…అదో బ్రహ్మపదార్థంలా..!