తెలుగుదేశం పార్టీలో అధికారం ఉందనే అహంకారంతో… ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎంత డ్యామేజ్ చేశారో.. ఇప్పుడు… వైసీపీకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అంతగా డ్యామేజ్ చేస్తున్నారు. సాక్షాత్తూ అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రినే జాగ్రత్తగా ఉండమని కోటంరెడ్డి హెచ్చరించారు. ఆ సమయంలో ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన చిరునన్వుల సపోర్ట్ ఆయనకు… లైసెన్స్‌గా మారిపోయింది. తనకు వ్యతిరేకంగా కథనాలు రాస్తున్నారని.. ఓ మైనార్టీ జర్నలిస్టును కోటంరెడ్డి నడిరోడ్డుపై నరికేస్తానని హెచ్చరించారు. ఆ తర్వాత జమీన్ రైతు అనే పత్రిక సంపాదకుని ఇంటిపైకి వెళ్లి విరుచుపడ్డారు. ఓ మహిళా డాక్టర్ చేయి పట్టుకుని.. లాక్కెళ్లారు. పూలకుండీలు పగలగొట్టి రచ్చ చేశారు. చంపేస్తాననే భయం కల్పించినంత చేసి.. వ్యతిరేక కథనాలు రాస్తే.. అన్నంత పని చేస్తానని హెచ్చరించి వెళ్లారు.
ఈ సారి ప్రభుత్వ ఉద్యోగినిపైనే విరుచుకుపడ్డారు. నేరుగా ఓ మహిళా అధికారి ఇంటికి రాత్రి సమయంలో వెళ్లి బీభత్సం సృష్టించారు. ఇంటికి కరెంట్ కట్ చేశారు. పైప్ లైన్ తవ్వేశారు. చెత్త తీసుకొచ్చి ఇంటి ముందు వేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న వాళ్లకు బతుకపై భయం కలిగే ప్రవర్తించి వెళ్లారు. ఇవన్నీ హెచ్చరికలే… నిజంగా హత్య కూడా చేయించబోయారన్న ఆరోపణలు ఎక్కువగానే ఉన్నాయి. ఏప్రిల్‌లో పోలింగ్ ముగిసిన కొద్ది రోజులకు… నెల్లూరులో టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కాకర్ల తిరుమలనాయుడును కొంత మంది దారి కాచి హత్య చేయబోయారు. దారి కాచి… ప్రొఫెషనల్ హంతకుల్లా ఈ దాడి చేశారు. సీసీ కెమెరాల్లో దొరికిపోవడంతో అసలు విషయం బయటకు వెల్లడయింది. ఈ హత్యాయత్నం చేసింది కోటంరెడ్డి ప్రధాన అనుచరులే. మొదట్లో తనకేమీ తెలియదన్న ఆయన .. తర్వాత తన అనచరులు .. హత్యాయత్నం చేస్తే.. తనకేం సంబంధమని వాదించారు. అసలు విషయం ఏమిటో నెల్లూరులో అందరికీ తెలిసిపోయింది.
చంపుతానని బెదిరించినా.. హత్యాయత్నాలు జరిగినా… అప్పుడు… ఇప్పుడు.. ఎవరూ జోలికి రావడం లేదన్న ఉద్దేశంతో … అధికార పార్టీ అనే అండతో.. కోటంరెడ్డి.. ఎవర్నీ లెక్క చేయడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దాడులతో అందర్నీ హడలెత్తిస్తున్నారు. ఈ కోటంరెడ్డి గతంలోనూ ఎమ్మెల్యేగా ఉన్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు కూడా.. పలుమార్లు దౌర్జన్యాల్లాంటివి చేయబోయారు. కానీ పోలీసులు గట్టి హెచ్చరికలు ఇవ్వడంతో సైలంటయ్యారు. నెల్లూరు జిల్లా బెట్టింగ్ రాకెట్లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంటుంది. ఆయనపై కేసులు కూడా ఉన్నాయి. అయితే ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఆయన తన అసలు మనిషిని బయటకు తేవడం ప్రారంభించారు. ఎన్నికల సమయంలో.. ఆయన నేరుగా పోలీస్ స్టేషన్ పైనే దాడి చేసి. .. కలకలం రేపారు. ఆయన గెలవడం.. ఆయన పార్టీ కూడా గెలవడంతో.. ఇక తిరుగులేకుండా పోయిందన్న విమర్శలు వస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఆ నష్టం ఎవరికో చింతమనేని వ్యవహారంతో తేలిపోతుందంటున్నారు.