నాడు మానుకోటలో జగన్ ను తరిమికొట్టిన టీఆర్ఎస్…!
రాజకీయం అంటే ఇదేనమో..? శాశ్వతమిత్రులు, శాశ్వత శత్రువలు ఉండరని చెబుతూ ఉంటారు. ఇప్పుడు.. వైసీపీ, టీఆర్ఎస్ ల మధ్య సాగుతున్న యుగళ గీతం చూస్తూంటే.. అదే అనిపిస్తోంది. నాడు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థి ప్రచారం కోసం… జగన్మోహన్ రెడ్డి వెళ్తే … ఏం జరిగింది..? మహబూబాబాద్ లో టీఆర్ఎస్ రణరంగం సృష్టించింది. రాళ్లతో తరిమికొట్టింది. ఫలితంగా జగన్మోహన్ రెడ్డి వెనక్కి తిరిగి రావాల్సి వచ్చింది. అంతేనా.. ఆ తర్వాత మళ్లీ తెలంగాణ వైపు చూడటానికే భయపడాల్సిన పరిస్థితిలో పడిపోయినట్లయింది. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొండా సురేఖ స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమితోనే.. వైసీపీ పతనం.. తెలంగాణలో ప్రారంభమయింది.
నేడు ఏపీలోకి టీఆర్ఎస్కు స్వాగతం పలుకుతున్న జగన్..!
మరి ఇప్పుడేం జరుగుతోంది. తెలంగాణలో తనను అడుగు పెట్టనీయకుండా… రాళ్లతో తరిమికొట్టిన టీఆర్ఎస్ నేతలను.. ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి.. ముకుళిత హస్తాలతో… ఆంధ్రలోకి స్వాగతం పలుకుతున్నారు. నవ్యాంధ్ర రాజధానికి ముకుళిత హస్తాలతో.. తన పార్టీ కార్యకర్తలతో ఘన స్వాగతం పలికి మరీ .. అతిథి మర్యాదులే చేయడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే.. విశాఖలో శాంపిల్ స్వాగతం ఇప్పించారు. ఇక విజయవాడలో నే మిగిలింది. అంటే.. ఎవరైతే తనను తరమికొట్టారో.. వాళ్లనే ఇప్పుడు సగర్వంగా సొంత రాష్ట్రంలోకి ఆహ్వానించాల్సిన పరిస్థితిలో కి జగన్ వెళ్లారు.
కేసీఆర్ వల్ల జగన్ కు కలిగే లాభం ఏమిటి..?
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో.. కేసీఆర్ ఏపీలోకి రావడానికి డిసైడయ్యారు. దానికి జగన్మోహన్ రెడ్డి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్కు ఇంతగా.. జగన్ లొంగిపోవాల్సిన అవసరం ఏమిటి..? ఆంధ్రప్రదేశ్లో టీఆర్ఎస్ కు ఓటు బ్యాంక్ ఉందా..? కేసీఆర్ పై సానుకూలత ఉందా..? ఆంధ్రప్రదేశ్ ప్రజలపై వ్యతిరేకతనే ఆలంబలనగా చేసుకుని ఉద్యమానని నడిపిన వ్యక్తి నుంచి వచ్చే మద్దతుతో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి లభించే మద్దతు ఎలా లాభిస్తుంది..?. కేసీఆర్ పై ఆయన ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారు..? ఏపీ ప్రజల సెంటిమెంట్లు వర్కవుట్ కావా..?. కేసీఆర్ నుంచి ఆర్థికంగా సాయం అందుతుందేమో కానీ… ఆ ఆర్థిక సాయంతోనే… ఎవరైనా ఎన్నికలను గెలవగలుగుతారా..? ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా వెళ్లి ఏం సాధిస్తారు..?
జగన్ వ్యక్తిత్వంపై అనుమానాలు రాకుండా ఎలా ఉంటాయి…?
తన ఇంట్లోకి తరిమికొట్టిన వ్యక్తిని.. తన ఇంట్లోకి ఆహ్వానిస్తున్న జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై.. ఎవరికైనా అనుమానాలొస్తే… అది వారి తప్పు కాదు. జగన్మోహన రెడ్డి రాజకీయ నడవడిక తప్పే. ఎందుకంటే… తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించారన్న… ఒక్క కారణంతో కసిగా కేసీఆర్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పానన్న జగన్మోహన్ రెడ్డి… అక్కడ ఏపీనే బూచిగా చూపి.. ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధించారన్న సంగతిని మర్చిపోయారు. చంద్రబాబు పెత్తనం మనకు అవసరమా అని కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో అన్నారంటే… చంద్రబాబు వ్యక్తిహోదాలో పెత్తనం చేస్తాడని కాదు.. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో.. ఏపీ పెత్తనం మనకు అవసరమా అనే …! ఈ విషయం జగన్మోహన్ రెడ్డికి తెలియనిది కాదు. అయినప్పటికీ.. ఏపీనే బూచిగా చూపి… ఎన్నికల్లో గెలిచిన కేసీఆర్ కు ఇప్పుడు జగన్.. సాష్టాంగపడిపోవడం.. కచ్చితంగా వ్యక్తిత్వ లోపమే…!
తెలంగాణ ప్రజలకున్నంత ఆత్మగౌరవం ఏపీ ప్రజలకు ఉండదా..?
జగన్మోహన్ రెడ్డికి… సీమ పౌరుషం మాటల్లోనే ఉందేమో కానీ… ఆయనను తరిమికొట్టి నానా దారుణంగా అవమానించిన వ్యక్తిని రాజకీయ భవిష్యత్ కోసం ఏపీకి తీసుకొచ్చి జయజయధ్వానాలు చేయిస్తారేమోకానీ… తెలుగు ప్రజలు అంత ఆత్మగౌరవం లేకుండా ఏమీ ఉండరు కదా. ఉద్యమం పేరుతో.. ఏపీని నానా రకాలుగా … నిందించిన వారికి నాయకత్వం వహించిన వ్యక్తి రాజకీయం కోసం వస్తానంటే.. ఎవరూ సహించరు కదా..! తెలంగాణలో.. ఏపీ ముఖ్యమంత్రి రాజకీయ ప్రచారం చేయడాన్నే…. తమపై జరిగిన దండయాత్రగా ప్రచారం చేసిన కేసీఆర్… ఏపీకి అదే పని మీద వస్తే… ప్రజలు దండయాత్రగా భావించరా..? ఏపీ ప్రజలకు అత ఆత్మగౌరవం ఉండదా..? జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోరా..?
—- సుభాష్