ప్రత్యేక హోదా విషయంలో విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి మొదట్నుంచీ చెబుతున్న మాట ఒక్కటే..! హోదా ఎవరిస్తే వారికే మద్దతు అంటున్నారు. ఇదే మాటను ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి చెప్పారు. ఏపీకి తమకు ప్రజలు పూర్తి మెజారిటీ కట్టబెడతారనీ, తమకు గెలుపుపై ఏమాత్రం అనుమానం లేదన్న ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్రమైన వ్యతిరేకత ప్రజల్లో ఉందన్నారు. కేంద్రం ఇచ్చిన ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారనీ, ఆ తరువాత మాట మార్చారనీ, తమతో కలిసి టీడీపీ ఎంపీలూ రాజీనామాలు చేసి ఉంటే హోదా వచ్చి ఉండేదని చెప్పారు.
ప్రత్యేక హోదా విషయమై తమ వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. ఎన్నికల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారా, రాహుల్ గాంధీ అవుతారా అనేది తమ ప్రాధాన్యత కాదన్నారు. ప్రత్యేక హోదా ఎవరిస్తే, వారినే బలపరుస్తామన్నారు. ‘ఏ పార్టీ అయినా ముందుగా అధికారంలోకి వచ్చి, ఆ తరువాత ప్రత్యేక హోదా ప్రకటించాలి, ఆ తరువాతే వారికి మద్దతు ఇస్తామ’ని స్పష్టం చేశారు! గతానుభవం దృష్ట్యా ఎవ్వర్నీ ముందుగా నమ్మే పరిస్థితిలో లేమన్నారు.
అంటే, కేంద్రంలో ఏదో ఒక పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలి, వారు హోదా ప్రకటించాలి, ఆ తరువాతే జగన్ వారికి మద్దతు ఇస్తారన్నమాట! జాగ్రత్తగా గమనిస్తే… ప్రాక్టికల్ గా ఇది సాధ్యమా అనిపిస్తుంది! భాజపా లేదా కాంగ్రెస్ లేదా ఎవరో ఒకరు… ఎన్నికలు జరిగిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వైకాపా మద్దతు ఇవ్వదనే కదా అర్థం. అంటే, వైకాపాతో ప్రమేయం లేకుండా ఏదో ఒక పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మరి, ఆ సమయంలో వైకాపా ఎంపీలు ఏం చేస్తారు..? ఎవరికీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటారా..? ఏదో ఒక పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వరకూ వేచి చూస్తారా..?
ఆ తరువాత ఏం జరుగుతుంది..? ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వని వైకాపాకి… అప్పటికే కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఏదో ఒక పార్టీ ప్రాధాన్యత ఇస్తుందా..? ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వని వైకాపా చేస్తున్న డిమాండ్లను పట్టించుకుంటుందా..? అప్పటికే అధికారంలోకి వచ్చేసిన పార్టీ దగ్గరకి వెళ్లి.. హోదా ఇస్తే మీకు మద్దతు ఇస్తామని తీరిగ్గా వైకాపా డిమాండ్ చేస్తే, స్పందించే అవకాశం ఉంటుందా..? భాజపా లేదా కాంగ్రెస్ లేదా ఎవరో ఒకరు.. అధికారంలోకి వచ్చి హోదా ప్రకటించారే అనుకుందాం. అప్పుడది వైకాపా డిమాండ్ చేయడం వల్ల, పోరాటం చెయ్యడం వల్ల వచ్చినట్టు ఎలా అవుతుంది..?
ఏపీలో అన్ని ఎంపీ స్థానాలు తమకు కట్టబెడితే… కేంద్రంలో కీలక పాత్ర పోషించి, హోదా తీసుకొస్తామని జగన్ అంటుంటారు. కానీ, కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించలేని పరిస్థితిని జగన్ ఇప్పుడే ఒప్పుకుంటున్నారు. ‘ముందుగా ఎవ్వరికీ మద్దతు ఇవ్వం’ అంటే అర్థం అదే కదా. హోదాను ఎలా సాధించుకోవాలో అనే క్లారిటీ జగన్ కి ఇప్పటికీ లేదని చాలాచాలా స్పష్టంగా కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చినవారికి మద్దతు ఇస్తామంటున్నారు. ఎవరైనా అధికారంలోకి వచ్చాక జగన్ మద్దతు కోసం ఎందుకు ఎదురుచూస్తారు అనేది విశ్లేషించుకోవడం లేదన్నమాట. మద్దతు ఇవ్వాలనుకుంటే ఎన్నికల ముందు ఉండాలి, లేదా ఎన్నికల తరువాత అయినా పొత్తులపై క్లారిటీ ఇస్తామనాలి. హోదా ఇచ్చేవారికి మద్దతు ఇస్తారా… లేదా, ఎవరో ఒకరు ఇచ్చేశాక మద్దతు ఇస్తారా అనే క్లారిటీ జగన్ వ్యాఖ్యల్లో ఇప్పటికీ లేదు.