ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ ను కలిశారు. దాదాపుగా గంట సేపు.. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల గురించి వివరించారు. ఇందులో పెద్ద విశేషం లేదు కానీ.. ఆయన వెంట… తన సతీమణి భారతీరెడ్డిని కూడా తీసుకెళ్లారు. సతీ సమేతంగా రాజ్‌భవన్‌కు వెళ్లిన జగన్ అక్కడ…ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో చర్చించారు. ఇటీవలి కాలంలో జగన్మోహన్ రెడ్డి… తన సతీమణికి పాలనా పరమైన అంశాల్లో ప్రత్యేకమైన అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇంట్లో జరిగే .. అధికారిక సమీక్షలతో పాటు.. కొంత మంది అధికారిక పనుల నిమిత్తం… భారతీరెడ్డిని కలుస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గవర్నర్ తో భేటీ కోసం.. జగన్ తన సతీమణితో వెళ్లడం.. హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలే అయినప్పటికీ.. పాలనా వైఫల్యాలు …హామీలు నెరవేర్చకపోవడం.. వివాదాస్పద నిర్ణయాలపై…ప్రభుత్వం ఎప్పుడూ వివాదాల్లో ఉంటోంది. శాంతిభద్రతల అంశంపైనా… పదే పదే ఫిర్యాదులు వస్తున్నాయి. వీటన్నింటి నేపధ్యంలో.. గవర్నర్‌కు తాజా పరిస్థితులను వివరించడానికి…జగన్ గవర్నర్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో…గవర్నర్‌తో పెద్దగా సమావేశమైన సందర్భాలు లేవు. పైగా.. కేంద్రం కూడా.. దూరమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. గవర్నర్‌తో ఎంత సఖ్యతగా… ఉంటే కేంద్రంతో అంత సఖ్యతగా ఉన్నట్లేనన్న అంచనాతో..జగన్ ఆయన వద్దకు వెళ్లారంటున్నారు.
అదే సమయంలో…ఢిల్లీలో సమయం,సందర్భం లేకపోయినా…విజయసాయిరెడ్డి.. జగన్మోహన్ రెడ్డి జైలు జీవితం గురించి…అఖిలపక్ష భేటీలో ప్రస్తావించారు. ఆ సమయంలో.. అనూహ్యంగా ఇతర పార్టీల నేతల నుంచి కూడా… అక్షింతలు పడ్డాయి. ఆ తర్వాత ఢిల్లీలో మరో రకమైన ప్రచారం ఊపందుకుంది. అసలే.. అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు లభించలేదు. దీని ద్వారా జరుగుతున్న ప్రచారానికి తోడు…జగన్.. అధికారిక వ్యవహారాల్లో భార్య ప్రాధాన్యాన్ని పెంచుతూండటం.. చర్చనీయాంశమవుతోంది.