వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేయడం తెలిసిందే. వైకాపాకి సొంతంగా వేరే ఎన్నికల అజెండా లేదన్నట్టుగా… కేవలం సీఎంని విమర్శిస్తూ, అధికార పార్టీల విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను నమ్మొద్దంటూ ప్రజలకు చెబుతూ ప్రచారం సాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారంలో భాగంగా… ఈ మధ్య కొన్ని మీడియా సంస్థలపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. తాను యుద్ధం చేస్తున్నది టీడీపీతో మాత్రమే కాదనీ, ఆ పార్టీకి మద్దతుగా నిలుస్తున్న ఎల్లో మీడియాతో కూడా అంటూ పిలుపునిస్తున్నారు.
ఇవాళ్టి సాక్షి పత్రికలో కూడా జగన్ వ్యాఖ్యల్లోని మీడియా సంస్థలపై విమర్శలకే ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఎందుకంత ప్రేమ… బాబుకు అమ్ముడుపోయిన ఎల్లో మీడియాని అడుగుతున్నా అంటూ జగన్ విమర్శలు చేశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తోపాటు అమ్ముడుపోయిన సంస్థలన్నీ… బంగారం కంటే బొగ్గే అందంగా ఉందనీ, నెమలి కంటే కాకి బాగుందని చెబుతాయన్నారు. ప్రపంచంలో అందరికంటే అందగాడు, పరిపాలనాదక్షుడు చంద్రబాబు నాయుడు అని ఊదరగొడుతున్నాయన్నారు. ఐదేళ్ల దుష్టపాలన అందంగా కనిపిస్తోందా, రైతులకు రుణమాఫీ చేయని తీరు అందంగా కనిపిస్తోందా, మహిళలకు డ్వాక్రా రుణాలు రద్దు చెయ్యని తీరు అందంగా కనిపిస్తోందా… ఇలా జగన్ చాలా తీవ్రంగా మీడియా సంస్థల తీరుపై మండిపడ్డారు.
మీడియా సంస్థలు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయా అనే తీరుగా జగన్ విమర్శలున్నాయి. ఇలా మీడియాపై విరుచుకుపడటం వల్ల ప్రజల్లోకి ఎలాంటి సంకేతాలు వెళ్తాయనేది వైకాపా వ్యూహకర్తలు ఆలోచించడం లేనట్టుగా ఉంది. ఒక పార్టీకి అనుకూలంగా ఒకటో రెండో మీడియా సంస్థలున్నాయంటే… సహజమే అనిపిస్తుంది. అంతేగానీ… ప్రముఖ మీడియా సంస్థల పేర్లన్నీ చెప్పేసి, వీరంతా అమ్మడుపోయారని విమర్శిస్తే… ఇదెలా సాధ్యమనే ప్రశ్న సామాన్యుడికి సైతం కలుగుతుంది. అంతేకాదు… ప్రముఖ మీడియా అంతా చంద్రబాబు పాలన బాగుందని చెబుతుంటే… ఈయన మాత్రమే ఎందుకు ఇంతగా స్పందిస్తున్నారనే అనుమానాలకూ ఆయనే తావిస్తున్నారు. పోనీ, జగన్ కి సొంతంగా మీడియా లేదా అంటే.. సాక్షి పత్రిక, టీవీ ఛానెల్ ఉన్నాయి. కేవలం వైకాపా కోసమే అవి పనిచేస్తున్నాయి. జగన్ అంటున్నట్టుగా ఇతర మీడియా సంస్థలు అమ్ముడుపోయి ఉంటే… దానికి సంబంధించిన సాక్షాధారాలతో కథనాలు రాయొచ్చు. పెద్ద ఎత్తున చర్చలు చేపట్టొచ్చు. చేతిలో సొంతంగా మీడియా ఉన్నప్పుడు… ఇప్పుడు జగన్ విమర్శిస్తున్న అంశాలను ఆ పత్రిక, ఆ ఛానెల్ సమర్థంగా తిప్పి కొట్టొచ్చు. చివరికి ఆ పనిని కూడా జగనే చేస్తున్నారంటే… సొంత మీడియాపై ఆయనకి నమ్మకం లేదేమో అనిపిస్తోంది. ప్రముఖ మీడియా అంతా అమ్ముడుపోయిందని విమర్శిస్తున్నప్పుడు… దానికి తగ్గ ఆధారాలను జగన్ గానీ, వైకాపా మీడియాగానీ ప్రజలకు చూపిస్తే బాగుంటుంది.