“ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో” కూడా తెలిస్తేనే రాజకీయాల్లో ఎవరైనా ముందుకెళ్తారు. రాజకీయాల్లో గెలిపించేది ప్రజలు. ఈ విషయంలో నిమిత్తమాత్రులు. కానీ ఎక్కడ తగ్గాలో అంచనా వేసుకోవాల్సింది నాయకులే. అధికారంలో ఉన్నామని తాము ఎప్పుడూ నెగ్గాలనుకోవడం అమాయకత్వం అవదు.. అహం అవుతుంది. రాజకీయాల్లో అహం అనేది ఓటమికి తొలి మెట్టు. ఎలాంటి ఈగోలు లేని వ్యక్తులే.. రాజకీయాల్లో రాణిస్తారు. పూర్తి స్థాయిలో కాకపోయినా కనీసం కంట్రోల్ చేసుకోగలిగే మానసిక ధృడత్వం ఉండాలి.
ఎస్ఈసీ విషయంలో తగ్గలేదు.. నెగ్గలేదు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కూడా ఎక్కడ తగ్గాలో తెలుసు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బీజేపీతో సాన్నిహిత్యం కూడా చాలా తగ్గారు. తన స్వభావానికి విరుద్ధంగా పాద నమస్కారాలు కూడా చేశారు. చేయించారు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా ఆ ” తగ్గుదల” కొనసాగిస్తున్నారు. కానీ.. ఆయన కాస్త తలపైకెత్తి చుట్టూ చూడటం మర్చిపోయారు. కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద తగ్గితే చాలు.. ఇంక ఎవరిపైనైనా రెచ్చిపోవచ్చు అన్నట్లుగా ఆయన అర్థం చేసుకున్నారు. కానీ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది లేదు. న్యాయవ్యవస్థతో లొల్లి పెట్టుకుని ఏం సాధించారు..? రాజ్యాంగ వ్యవస్థలతో గొడవలు పెట్టుకుని ఏం బావుకున్నారు..?. ప్రజాస్వామ్యంలో పాలకులకే అధికారాలు ఉంటాయి. కానీ సర్వాధికారాలు కాదు. రాజ్యాంగం కొన్ని జాగ్రత్తలు తీసుకుంది. పాలకులు ఇప్పటి వరకూ ఆ జాగ్రత్తల్ని పాటిస్తూ… తమ ప్రయోజనాలు నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తూ వచ్చారు. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఏ రాష్ట్రంలో అయినా.. ఎవరి ప్రభుత్వ హయాంలో అయినా ప్రభుత్వానికి ఎదురు తిరగడం చూశామా..? చివరికి ఏపీలో కూడా.. మొదట్లో నిమ్మగడ్డ ప్రభుత్వానికే అనుకూలంగా ఉన్నారు. గందరగోళం జరిగినా లైట్ తీసుకున్నారు. చివరికి హైకోర్టు చీవాట్లు పెట్టడంతో… ఆయన మేలుకున్నారు. దీనంతటికి వైసీపీ ముఖ్య నేతల అతే కారణం. ఎన్నికల్లేకుండా గెలిచేసుకోవాలన్న తాపత్రయంతో దాడులు, దౌర్జన్యాలు చేసి ఏకగ్రీవాలు చేసుకోవడంతో సమస్య వచ్చింది. ఆ తర్వాతైనా…ఎస్ఈసీని కూల్ చేసే ప్రయత్నం చేశారా అంటే… ఆయనతో గొడవలు పెట్టుకుంటూనే పోయారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉండి.. తన అధికారాలపై స్పష్టమైన అవగాన ఉన్న.. బ్యూరోక్రాట్ ఏం చేయగలరో.. అది శక్తివంచన లేకుండా చేయడానికి ప్రభుత్వం ఆయన్ని ప్రేరేపించింది. ఫలితంగా నిమ్మగడ్డను ఓ శత్రువుగా చేసుకుని ఆయన హయాంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చింది. ఒక్క సారి వెనక్కి తిరిగి చూసుకుంటే… ప్రభుత్వానికి ఎంత తప్పు చేశామో సులువుగానే అర్థమవుతోంది. ఎన్నికల్లో గెలుపోటముల సంగతి తర్వాత ” ముఖ్యమంత్రి నేనా రమేష్ కుమారా..?” అని బదిలీల విషయంలో వాదించిన ముఖ్యమంత్రి ఇప్పుడు.. రమేష్ కుమార్ చెప్పినట్లుగా చేయాల్సి వస్తోంది. ఎన్నికలు నిర్వహించబోమని సవాల్ చేసి.. నిర్వహించాల్సి వస్తోంది. ఇదీ ఓటమి అంటే.
“అహం” వల్లే ఇలాంటి ఓటములు..!
రాష్ట్ర ప్రభుత్వం కాస్త ఇగో తగ్గించుకుంటే మంచిదని చాలా కాలంగా ప్రజల్లో ఓ అభిప్రాయం ఉంది. సుప్రీంకోర్టు కాస్త అటూ ఇటూగా ఇదే మాట చెప్పింది. వ్యవస్థల మధ్య “అహం” కోసం జరుగుతున్న యుద్ధంలో తాము రాదల్చుకోలేదని స్పష్టం చేసింది. ఎన్నికలు ఎదుర్కోవడానికి జగన్మోహన్ రెడ్డి వెనుకడుగు వేస్తున్నారని ఎవరూ అనుకోవడం లేదు. తమకు ల్యాండ్ స్లైడ్ మ్యాండేట్ ఉందనేది జగన్ నిశ్చితాభిప్రాయం. మరి ఎందుకు ఆయన వెనక్కు తగ్గుతున్నారు. కేవలం నిమ్మగడ్డ రమేష్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరగకూడదన్న ఒకే ఒక్క “అహం”తో ఆయన ఎన్నికలు వద్దంటున్నారు. ఒక వేళ ఎన్నికల ప్రక్రియ జరగకపోతే… నిమ్మగడ్డ రిటైరై.. కొత్త ఎస్ఈసీని నియమించిన మరుక్షణం… ఏపీలో ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని సులువుగానే ఊహించవచ్చు. నిమ్మగడ్డ ఎన్నికలు నిర్వహిస్తే ఏమవుతుంది…? యంత్రాంగం అంతా ప్రభుత్వం చేతుల్లో ఉంది. నిమ్మగడ్డ అంపైర్ లాంటి వారే. ఫలితాలను మార్చలేరు. కానీ.. ఆయన హయాంలో జరగకూడదనే పట్టుబట్టారు. రాజ్యాంగ ధిక్కరణకు సైతం పాల్పడ్డారు. చివరికి తల వంచక తప్పలేదు. అహ్మం బ్రహ్మస్మి అని ఊరకనే అనలేదు కదా..!
ఏకగ్రీవాల పేరుతో ఇప్పటికీ అదే “అహం”…!
సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాతైనా.. వాస్తవ పరిస్థితుల్ని ప్రభుత్వం.. అందులోని పెద్దలు అర్థం చేసుకోవాల్సింది. కానీ.. ఏకగ్రీవాల పేరుతో మళ్లీ ఎస్ఈసీతో గొడవలు పెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. రాజకీయాల్లో గెలుపోటములు అనేది తన చేతుల్లో ఉండదు. ప్రజల చేతుల్లో ఉంటుంది. ప్రజలు అధికారం ఇస్తేనే అధికారం వస్తుంది. అయితే ఆ అధికారాన్ని ప్రజల నుంచి లాగేసుకుని.. తమ వద్దే అట్టి పెట్టుకోవడానికి పాలకులు ప్రయత్నించడమే ఇక్కడ విషాదం. ఏకగ్రీవాల పేరుతో.. దాడులు. దౌర్జన్యాలకు దిగి నామినేషన్లు వేయలేని పరిస్థితి సృష్టించి.. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు కూడా వేయలేని పరిస్థితి తీసుకు వస్తే ఇక ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదు. ప్రజలు ఇచ్చిన అధికారంతో… వారి అధికారాన్ని దూరం చేయడమే అవుతుంది. ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. వైసీపీకి అసెంబ్లీ ఎన్నికల్లో 50 శాతానికిపైగా ఓట్లు వచ్చాయి. 151 సీట్లు వచ్చాయి. ఇలాంటి విజయం సాధించిన పార్టీ.. స్థానిక ఎన్నికల్లోనూ అదే హవా చూపించడానికి అవకాశం ఉంటుంది. దానికి దాడులు.. దౌర్జన్యాల అవసరం లేదు. ప్రత్యర్థి పార్టీల నేతలు పోటీలో ఉండకుండా… చేయాల్సిన ఆగత్యం కూడా లేదు. ఎవరి మానాన వారు పోటీ చేసినా… ప్రజలు.. పట్టం కడతారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేస్తేనే… అసలైన గెలుపు. దాడులు చేసి..భయపెట్టి.. ప్రత్యర్థుల్ని పోటీలో ఉండకుండా చేయడం ద్వారా తెచ్చుకునే గెలుపు ప్రజలు ఇచ్చేది కాదు. అది ప్రజాస్వామ్య విరుద్ధం. కానీ ఇప్పుడు ఏపీలో అదే జరుగుతోంది. నామినేషన్లు వేయనివ్వడం లేదు.. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు.. ఏ ప్రభుత్వం అయినా.. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించి.. తమ సమర్థతను చాటాలనుకుంటుంది. కానీ ప్రస్తుత ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణలో ఎంత చెడ్డపేరు వచ్చినా.. ఏకగ్రీవంగా గెలవాలనుకుంటోంది. ఇది కూడా.. ఈగో వల్లనే. కాస్త విశాలంగా ఆలోచిస్తే మంచే జరిగేది.
అనుభవం .. ఆలోచన… కేసీఆర్ మార్క్..!
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా… రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఆయన ఎప్పుడూ.. ఎక్కడ రాజ్యాంగ వ్యవస్థలను పల్లెత్తు మాట అనలేదు. ఆయన ప్రభుత్వ నిర్ణయాలను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. కానీ ఒక్క మాట మాట్లాడలేదు. హైకోర్టు చెప్పినట్లుగా చేసుకున్నారు. తనకు వ్యతిరేకంగా తీర్పులిస్తే… కాంగ్రెస్తోనో…బీజేపీతోనే కుమ్మక్కయ్యారని ఆరోపించేసి.. తనకు అనుకూలంగా తీర్పులివ్వాలని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేసి.. న్యాయమూర్తుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనుకోలేదు. ప్రస్తుత గవర్నర్ కొన్ని సందర్భాల్లో తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు చేసినా… ఆయన బయటపడలేదు. ఎప్పుడూ గౌరవం ఇస్తూనే ఉన్నారు. రాజ్యాంగ పరమైన అంశాల్లో ఆయనకు స్పష్టత ఉంది. తనకు 80శాతం ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆయన కోర్టులపై .. రాజ్యాంగ వ్యవస్థలపై సవారీ చేస్తానని బయలుదేరలేదు. ఆ విషయంలో ఆయన తగ్గే ఉన్నారు. ఈ విషయంలో ఆయన అనుభవం ఉపయోగపడింది అనుకోవచ్చు. అలాంటప్పుడు అనుభవం లేని వారు.. కేసీఆర్ ను చూసి నేర్చుకోవాల్సి. జీవితంలో ఎదురయ్యే ఘటనలు… ఎదుటి వారి అనుభవాలను చూసి నేర్చుకోనిదే ఎవరూ మెరుగైన స్థితికి చేరలేరు.
అహం ఓటమికి దగ్గరిదారి..!
అహంకారం ఉంటే సంస్కారానికి ఆస్కారం ఉండదు. అహంకారానికి మొదలు ఉంటుంది తప్ప అంతం ఉండదు. సాటి మనుషులు కంటికి ఏమాత్రం ఆనరు. ఎగిరే విమానంలోంచి చూస్తే కనిపించినట్లు చీమల్లాగా దోమల్లాగా కనబడతారు. అత్త మీద కోపం దుత్త మీద చూపించడం కూడా అహంకారంలో భాగమే. నడమంత్రపు అధికారం… నరం మీది పుండు నిలవనివ్వవు. ఇష్టం వచ్చినట్టు ఆడిస్తాయి. వాటి చేత చిక్కితే అధంపాతాళానికే తీసుకెళ్తాయి. అహంకారం తలకెక్కితే వచ్చే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. నిజానికి దీన్ని అహం అనేది ఓ రకంగా ఆత్మవిశ్వాసంకూడా అనుకోవచ్చు. కానీ అది హద్దుల దాటనంత వరకే. హద్దులు దాటితే అహం..బ్రహ్మస్మి..!
అధికారంలో ఉన్నాంకాబట్టి తామే పెద్దలం అనుకుంటే కష్టం. అంత కంటే పెద్దలు ఉంటారు. వారు చెప్పింది అర్థంచేసుకోవాలి. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది అదే. నేర్చుకుంటారా..లేదా అన్నది తర్వాతి విషయం.