వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్ చేసిన క్విడ్ ప్రో కో పనుల్లో భాగంగా రస్ అల్ ఖైమా అనే సంస్థతో కలిసి బాక్సైట్ మైనింగ్ ప్రారంభించారు. వైఎస్ మరణం తర్వాత అవన్నీ ఆగిపోయాయి. దాంతో… జగన్ అక్రమాస్తుల కేసులో.. రస్ అల్ ఖైమాతో కలిసి పెట్టుబడులు పెట్టిన వారు బుక్కయ్యారు. రాకియా కూడా మోసం చేశారని.. నష్టపోయామని అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు వెళ్లింది. రస్ అల్ ఖైమా రూ. ఆరు వందల కోట్ల పరిహారం కోసం డిమాండ్ చేస్తోంది. ఈ కేసు విచారణలో తమ వాదనలు వినిపించడానికి ఏపీ ప్రభుత్వం అధికారుల బృందాన్ని పంపుతోంది.
గతంలో ఈ కేసు తమ పరిధిలోకి రాదని లండన్ ఆర్బిట్రేషన్ కోర్టు చెప్పింది. ఇప్పుడు ఎవరి పరిధిలోకి వస్తుందో తేల్చనున్నారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. తర్వాత ప్రభుత్వాలు బాక్సైట్ అనుమతుల్ని రద్దు చేశాయి. ఒరిస్సా నుంచి బాక్సైట్ సరఫరాకు అనుమతి ఇవ్వాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే కేంద్రం బాక్సైట్ సరఫరాకు అనుమతి ఇచ్చిందో లేదో స్పష్టత లేదు. అలాగే రస్ అల్ ఖైమా కూడా బాక్సైట్ సరఫరాకు అంగీకరించిందో లేదో స్పష్టత లేదు.
జగన్ హయాంలో అన్‌రాక్, ఏపీఎండీసీ మధ్య బాక్సైట్ సరఫరా వివాదం పరిష్కారానికి గతంలోనే ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. అందులో జుల్ఫీ రావ్జీ అనే వ్యక్తికి కూడా చోటు కల్పించింది. జుల్ఫీ కి సహాయకారిగా ఉండేలా… ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు ప్రత్యేక బాధ్యతలు ఇచ్చారు. ఆ ప్రయత్నాలు ఏమయ్యాయో స్పష్టత లేదు. ఆ వివాదంతో తమకు సంబంధమే లేదని.. మీరే పరిష్కరించుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. ఆర్బిట్రేషన్‌లో జరిగే వాదనలను బట్టి ప్రభుత్వం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.