వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ డిజాస్టర్ గా మారింది. అమిత్ షాతో ఉదయం పదకొండు గంటలకు జగన్ భేటీ అయ్యారని.. దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు జరిపారని… సీఎం తరపున మీడియాకు సమాచారం వచ్చింది. విభజన అంశాలపై నివేదికలు ఇచ్చారని నిధుల విడుదల చేయాలని కోరారని.. చెప్పారు. కానీ అసలు విషయం మాత్రం వేరే అని.. తెలుస్తోంది. ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు. ఆయన వద్దకు పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చారు. శుభాకాంక్షలు తెలిపేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. జగన్.. అమిత్ షా ఇంటికి వెళ్లినప్పటికీ.. శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే … తప్ప… ఇతర అంశాలు మాట్లాడే అవకాశం రాలేదని… ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చే సరికి.. జగన్ కు మరో షాక్ తగిలింది.
అప్పటికే ఖరారైన ఇద్దరు కేంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషి అపాయింట్మెంట్లు కూడా రద్దయ్యాయి. దీంతో జగన్ అసహనంతో తిరుగు ప్రయాణమయ్యారు. రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషీలకు అత్యవసర సమావేశాలేమీ లేకపోయినా… జగన్ అపాయింట్మెంట్లు ఖరారు చేసి.. రద్దు చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం… పెట్టుకున్న పిటిషన్ పై.. ఒకటో తేదీన సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. ఈ క్రమంలో… కేంద్రంలో పెద్దలతో సన్నిహితంగా మెలగడం ద్వారా ఎంతో కొంత అడ్వాంటేజ్ సాధించాలన్న ప్రయత్నం చేశారన్న ప్రచారం ఢిల్లీలో జరిగింది. ఈ కారణంగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అపాయింట్మెంట్ రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.
మరో వైపు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా జగన్ అపాయింట్మెంట్ క్యాన్సిల్ పై స్పష్టమైన సూచనలు వచ్చాయంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా పెట్టుబడులు వాతావరణం దెబ్బతిన్నది. మళ్లీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. పీపీఏలు రద్దు చేసిన జగన్… ధర్మల్ పవర్ పెంచుకుంటామని.. అదనపు బొగ్గు ఇవ్వాలంటే జోషిని కలిసి అడగబోతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించినట్లుగా అనిపిస్తే.. ఇబ్బంది ఎదురవుతుందని.. ప్రహ్లాద్ జోషి కూడా క్యాన్సిల్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటన రెండు రోజుల పాటు నిస్సారంగా గడిచింది.