ముందుగా ఓ చిన్న పిట్ట కథ! వెనకటికీ.. ఒక సైన్యం. యుద్ధానికి ప్రిపేరైపోయింది. ప్రత్యర్థిపై ఎప్పుడెప్పుడు ఎటాక్ చేద్దామా అంటూ సైనికులు కత్తులు బాగా అంటే బాగా నూరుతున్నారు. కానీ, యుద్ధం రావట్లేదు. కత్తులకు పదును ఎక్కువైపోతోంది. దీంతో ఏం చెయ్యాలో తోచని ఓ సైనికుడికి.. వన్ ఫైన్ మార్నింగ్ ఓ బ్రహ్మాండమైన ఆలోచన వచ్చింది. యుద్దం వచ్చేలోపు.. కత్తికి ఉన్న పదును ఏపాటిదో పరీక్షిద్దామనుకున్నాడు. పరీక్షించాడు.. చాలా బాగా పనిచేస్తోందని తెలుసుకున్నాడు! ఈ విషయం ఇతర సైనికులకు తెలిసింది. వాళ్లూ ట్రై చేశారు. ఫలితాలు అద్భుతం అనుకున్నారు. ఇంతకీ.. ఆ సైనికులు చేసిన పరీక్ష ఏంటో చివర్లో తెలుసుకుందాం!
కార్లు మార్చినట్టు, పవన్ కల్యాణ్ భార్యలను మారుస్తారంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్ పై ఎంతటి రగడ జరుగుతోందో తెలిసిందే. దీనిపై పవన్ స్పందించడం. ఆ తరువాత, అభిమానులు స్పందించడం. ఆ తరువాత వైకాపా మద్దతుదారులు స్పందించడం. ఈ చర్చ మీడియా వేదికలతోపాటు సోషల్ మీడియాలో మరింత తీవ్రతరం అవుతోంది. జగన్ అభిమానులు వెర్సెస్ పవన్ అభిమానులు అన్నట్టుగా వ్యవహారం మారిపోయింది. జగన్ వైఫల్యాలను ఎండగట్టడమే పనిగా పెట్టుకున్నారు… పవన్ అభిమానులు. జనసేన లోపాలను ఎత్తి చూపడమే కిం కర్తవ్యంగా పనిచేస్తున్నారు వైకాపాలో ఒక వర్గం వారు. చోటామోటా లీడర్లంతా అందుబాటులో ఉన్న టీవీ ఛానెల్స్ డిబేట్లకు వెళ్తున్నారు. ఎవరి వాదనను వారు బలంగా వినిపిస్తున్నారు.
అయితే, ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు పనిలేకుండా పోతోందట! ఆంధ్రాలో వైకాపా, జనసేనలు కలిసి టీడీపీపై మూకుమ్మడి విమర్శల దాడి చేయడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. పాదయాత్రలో ఆయన, బస్సుయాత్రలో ఈయన పుంఖానుపుంఖాలుగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. కోట్లకు కోట్లు అవినీతి అన్నారు. దీంతో సోషల్ మీడియాలోగానీ, ఇతర మాధ్యమాల్లోగానీ డిఫెండ్ చేసుకునే పనిలో బిజీబిజీగా ఉన్న టీడీపీ క్యాంపుకి ఇప్పుడు పని తగ్గినట్టే అయిందట. ప్రస్తుతం దేశం వర్గాల్లో ఇదే చర్చ జరుగుతున్నట్టు సమాచారం. జగన్, పవన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ తమకు పనిలేకుండా చేస్తున్నారనే సరదా కామెంట్లు టీడీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ఇంకా సస్పెన్స్ వద్దు… ‘సైనికుల పరీక్ష’ విషయానికొద్దాం. కత్తులు బాగా పదునుకుపెట్టుకున్న ఆ సైనికుడు.. దాన్ని పరీక్షించడం కోసం… పక్కనున్న సైనికుడిని చంపేశాడట! అదే స్ఫూర్తితో… తమ కత్తులు కూడా ఇలాగే పనిచేస్తున్నాయో లేదో చూద్దామని ఇంకొంతమంది సైనికులకు అనిపించిందట. వారు కూడా ఆ పరీక్షలో అద్భుత విజయాలను నమోదు చేసుకోవడం జరిగింది. ఫలితం… యుద్ధం రాకముందే సగం సైన్యం ఖాళీ. సమరానికి ముందే సగానికిపైగా ఓటమి.
వైకాపా, జనసేనలు వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి రాజకీయ ప్రత్యర్థి టీడీపీపై సమరం సాగిస్తాయనుకుంటే… ఈలోగా ప్రతిపక్షాల బలాన్ని తగ్గించుకోవడం కోసం ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. నిజానికి, జగన్ పవన్ లు కలిసే పనిచేస్తున్నారనే ప్రచారాన్ని టీడీపీ ఎత్తుకుంది. దాన్ని ఎన్నికల దాకా ఖండించకపోతే, అది నిజమేనేమో అనే అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లిపోతుందన్న ఉద్దేశంతోనే కావొచ్చు… పవన్ అంటే మాకు అస్సలు పడదు అని నిరూపించుకునే ప్రయత్నంలో భాగంలోనే జగన్ ఈరకమైన కామెంట్లు చేసి ఉండొచ్చు. కానీ, ఏమైంది భావసారూప్యత గల పార్టీలను తన పక్కన చేర్చుకునే అవకాశాన్ని కుత్తుకలోకి కోసేశారు! జనసేన, వైకాపా.. ఈ రెండు పార్టీలూ యుద్ధం మొదలు కాకముందే కత్తుల పదును పరీక్షించుకునే క్రమంలో ఉన్నట్టున్నాయి.