ఏపీ ప్రభుత్వం ఎప్పుడు కేబినెట్ భేటీ నిర్వహించినా చాలా నిర్ణయాలు తీసుకున్నట్లుగా గొప్పగా ప్రకటిస్తూ ఉంటారు. వాటిలో చాలా వరకూ గతంలో తీసుకున్న నిర్ణయాలే ఉంటాయి లేకపోతే.. మోసపూరితమైన నిర్ణయాలు ఉంటాయి. సీఎంగా మొదటి కేబినెట్ భేటీలో జగన్ తీసుకున్న నిర్ణయాలను చూస్తే.. ఫేక్ పరిపాలనలో… ఫేక్ నిర్ణయాలతో మభ్యపెట్టడం అనేది ఓ టాస్క్ గా పెట్టుకున్నారని సులువుగా ్ర్థం చేసుకోవచ్చు.
తొలి కేబినెట్లో 9 గంటల ఉచిత విద్యుత్ నిర్ణయం – ఎక్కడిస్తున్నారు ?
సీఎంగా బాధ్యతలు చేపట్టిన తొలి కేబినెట్ భేటీలో రైతులకు ఉచిత విద్యుత్ 9 గంటలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడా అమలు కావడం లేదు సరి కదా మీటర్లు పెడుతున్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలిస్తామని ప్రకటించారు. నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏడాది రైతులకు…ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి.. దాదాపుగా రూ. అరవై వేల కోట్లు రైతులు తీసుకున్న రుణాలకు వడ్డీ కడతామని చెప్పారు. ఇప్పుడు అసలు అలాంటి పథకమే అమల్లో లేదు.
రైతు భరోసా నిర్ణయంలో పచ్చి మోసం
వైఎస్ఆర్ రైతు భరోసా పథకంతో…. ప్రతి రైతుకు మేలో ఒకే సారి రూ. 12,500 ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించారు. కానీ దాన్ని ఏడున్నర వేలకు తగ్గించారు. మిగతా మొత్తం కేంద్రం ఇస్తోందిగా అని అడ్డగోలు మాటలు చెబుతున్నారు. ఒకే సారి కాకుండా మూడుసార్లకు మార్చేశారు. ఉచిత బోర్లు… ధరల స్థిరీకరణ నిధి, విపత్తు నిధి ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకున్నారు. అవన్నీ ఉత్తుత్తు నిర్ణయాలుగా మిగిలిపోయాయి.
ఉద్యోగులకు నట్టేట మోసం
వారంలో రద్దు అని చెప్పినట్లు సీపీఎస్ రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందు కోసం కమిటీ వేశామని చెప్పారు. అది ఏమయిందో నాలుగేళ్ల కేబినెట్ భేటీలో కళ్ల ముదే ఉంది. పీఆర్సీ అమలు చేయాలని నిర్ణయించారు. ఎలా అమలు చేశారో చూశారు. చంద్రబాబు మధ్యంతర భృతి ఇస్తే.. దాన్ని తగ్గించారు . ఆర్టీసీ విలీనం మరో మోసం. ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు.
తొలి కేబినెట్ భేటీ తర్వాత పదవి చేపట్టిన వెంటనే 90శాతం హామీల్ని నెరవేర్చామని ప్రకటించుకున్నారు. ఇప్పటికి అది 98.4 శాతం అయింది. కానీ జగన్ చెప్పినా.. హామీలు ఇచ్చిన వాటిల్లో ఒక్కటీ పూర్తి స్థాయిలో చేయలేకపోయారు. ఇంత చేతకాని తనం కళ్ల ముందు కనిపిస్తూంటే.. కేబినెట్ భేటీలో జగన్ తీసుకునే నిర్ణయాలపై ఎవరికి ఆసక్తి ఉంటుంది.