ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రజా సంకల్ప పాదయాత్ర వంద రోజులుకు చేరుకుంది. పార్టీపరంగా వారికి ఇదో మైలురాయి. వందరోజుల యాత్రలో జగన్ చాలామంది ప్రజలను కలుసుకున్నారు. చాలా సభల్లో మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీ పాలనను ఎండగడుతున్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అంతా మోసమని ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ, ఈ పాదయాత్ర ద్వారా జగన్ మాత్రమే జనంలోకి వెళ్తున్నారా..? ఆయనతోపాటు వైకాపా ఆలోచనా విధానం, నవ్యాంధ్ర ఆకాంక్షలకు అనుగుణంగా వైకాపా విజన్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతున్నారా..? సంబరాల కంటే ముందుగా వారు విశ్లేషించుకోవాల్సిన కీలక అంశాలు ఇవి.
పాదయాత్రలో జగన్ ప్రసంగాల గురించి చెప్పాలంటే… గడచిన 100 రోజుల్లో దాదాపు అన్ని రోజులూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలకే జగన్ పరిమితం అవుతూ వచ్చారనడంలో సందేహం లేదు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ఇళ్లు లేవు, ఉద్యోగాల్లేవు, నీళ్లు లేవు, మద్దతు ధర లేదు, ప్రాజెక్టులు లేవ అంటూ చెబుతూ వస్తున్నారు. ఇక, అవినీతి గురించి మాట్లాడుతూ… ఇసుక నుంచి గుడి దాకా, గుడి నుంచి బడి దాకా అంటూ ఇలా ఎక్కడ చూసినా అవినీతి మయమైపోయిందంటారు! జగన్ మాటల్లో మరో అంశం.. విశ్వసనీయత..! రాజకీయాల్లోకి విశ్వసనీయత రావాలంటారు, అది జరగాలంటే దేవుడి దయవల్ల ప్రజల ఆశీర్వాదం వల్ల వైకాపా అధికారంలోకి రావాలంటారు. ఇక, టీడీపీ హామీల గురించి విమర్శిస్తూ… హామీల పేరుతో మోసం చేశారనీ, ఎన్నికల ముందు మళ్లీ జనంలోకి వచ్చి కిలో బంగారం, మారుతీ కారు ఇస్తానని కూడా వాగ్దానం చేస్తారంటూ విమర్శిస్తారు. తాజా అంశం ప్రత్యేక హోదాను తీసుకున్నా… సాధించడంలో చంద్రబాబు విఫలమయ్యారనే పోరాటం అంటున్నారు. అంతేతప్ప, మాట తప్పిన కేంద్రంపై ఒక్కమాట కూడా మాట్లాడటం లేదు. గడచిన వందరోజుల్లో అన్ని ప్రసంగాల్లో దాదాపుగా ఇవే అంశాలు ఉంటూ వస్తున్నాయి.
ఇక, పాదయాత్రలో ప్రజలకు వైకాపా ఇచ్చిన విజన్ చెప్పాలంటే… గత వందరోజుల్లో నవరత్నాల హామీల గురించి బాగానే ప్రచారం చేసుకున్నారు. మరికొన్ని ఉచిత పథకాల గురించి చాలా చెప్పారు. అయితే, ఇవన్నీ కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే. ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడ్డ నవ్యాంధ్యకు సంక్షేమ పథకాలు ఒకటే చాలవు కదా. అభివృద్ధి కావాలి, యువతకు ఉపాధి కావాలి, హైదరాబాద్ తో ఐటీ రంగం పోటీ పడే స్థాయి ఆకర్షణ కావాలి. పాలనాపరంగా చూసుకుంటే రాజధాని నిర్మాణం జరగాలి. నవరత్నాలు మినహా… ప్రతిపక్ష పార్టీ నుంచి ఈ ఇతర ముఖ్యమైన అంశాలపై వందరోజుల్లో ఎలాంటి స్పష్టతా జగన్ ఇవ్వలేదనే చెప్పాలి..! కేవలం జనాకర్షక పథకాల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. టూకీగా ఈ పాదయాత్ర ద్వారా ప్రజల్లో వెళ్లిన వైకాపా విజన్ ఏంటంటే… చంద్రబాబుపై వ్యతిరేకతను ప్రాతిపదికగా చేసుకుని అధికారం సాధిస్తామంటున్నారే తప్ప, నవ్యాంధ్రను కొత్త పుంతలు తొక్కించే అభివృద్ది ప్రణాళికల ప్రాతిపదిక వారి దగ్గర కనిపించడం లేదు!
గడచిన వంద రోజులుగా జగన్ నడుస్తున్నారు. ఇప్పటికైనా వైకాపాను ఆయన వెంట నడిపించుకోవాలి. జగన్ జనంలో ఉంటున్నారు కదా.. వైకాపాను వేరుగా చూడ్డమేంటీ అనే లాజిక్ తియ్యొచ్చు. జగన్ ఒకరికి ఓదార్చితే అది వ్యక్తిగతమైన ప్రేమానురాగ ప్రదర్శన అవుతుంది. అదే జగన్ కి ఓటెయ్యాలనుకున్నప్పుడు ఒక ఓటరు, వెనక కుటుంబం, పిల్లలు, వారి భావిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అభివృద్ధి, పరిశ్రమలు, మోసం చేసిన కేంద్రం…ఇవన్నీ ఆలోచనకి వస్తాయి. వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కీలకాంశాలే కదా. జగన్ పాదయాత్ర వందరోజుల మైలు రాయి దాటింది, కానీ వైకాపా…?