ప్రతిపక్ష నేత జగన్ మొదలుపెట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర 38 రోజులు పూర్తిచేసుకుంది. అనంతపురం జిల్లాలో ప్రస్తుతం ఆయన నడక సాగుతోంది. 38వ రోజు విషయానికొస్తే… ధర్మవరం నియోజక వర్గం పరిధిలో ఆయన పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా తాను మోసం చేయనని చెప్పారు. ప్రజల ఆశీర్వాదంతో, దేవుడి దయతో మరో ఏడాదిలో తాము అధికారంలోకి రాగానే ఉన్నత చదువులకు అవసరమయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇక, చంద్రబాబు సర్కారుపై తనదైన రొటీన్ పంథాలో విమర్శలు చేశారు. 37వ రోజు విషయానికొస్తే.. రావులచెరువు ప్రాంతంలో ప్రజలను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న అంశాలనే మళ్లీ చెప్పారు. చంద్రబాబు నాయుడు పాలన అత్యంత దారుణంగా ఉందన్నారు. ప్రజలను ఆయన నిలువునా మోసం చేశాడన్నారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ప్రజల్ని మోసం చేయడంలో ఆశ్యర్యం ఏముంటుందన్నారు.
అయితే, గడచిన కొన్ని రోజుల పాదయాత్రను జాగ్రత్తగా గమనిస్తే… జగన్ ప్రసంగాలకు ప్రజా స్పందన బాగానే ఉంటోంది! టీడీపీ సర్కారుపై ఆయన వేయబోతున్న పంచ్ డైలాగులు ముందే తెలుసు కాబట్టి, ప్రజలు కూడా జగన్ కు తక్షణం స్పందిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ‘చంద్రబాబు మోసాన్ని ఇక్కడితో అడ్డుకోకపోతే, తరువాత ఎన్నికల్లో ఏ స్థాయి హామీలు ఇస్తాడో తెలుసా..’ అనేలోపుగానే ప్రజల్లో కొంతమంది.. కేజీ బంగారం, మారుతీ కారు అంటూ నినదించడం విశేషం! ‘బాబు వస్తే జాబు వస్తుందన్నాడు. లేదంటే, నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు, ప్రతీ ఇంటికీ నెలకి…’ అని పూర్తి చేసే లోగానే ‘రెండేసి వేలు ఇస్తానన్నారు’ అంటూ జనంలోని వినిపిస్తోంది. పెన్షన్ గురించి మాట్లాడగానే రూ. 2వేలు అంటున్నారు. 45 సంవత్సరాలు అంటున్నారు. ఇలా ప్రతీ సందర్బంలోనూ జగన్ చెప్పబోయే తరువాతి మాటేంటో ఆయన సభలకు హాజరౌతున్నవారిలో చాలామందికి ముందుగానే తెలిసిపోతోంది!
ఇది జగన్ మాటలకు వస్తున్న అనూహ్య స్పందనగా వైకాపా చూస్తోంది. కానీ, ఈ క్రమంలో వారు గమనించాల్సిన మరో అంశం… జగన్ స్పీచులు చాలా రొటీన్ అయిపోయాయనేది అర్థం చేసుకోవాలి. ఆయన పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచీ కొన్ని అంశాలపై ఒకే తరహాలో మాట్లాడుతున్నారు. అవి వినీవినీ చాలామందికి కంఠతా వచ్చేశాయనడంలో ఆశ్చర్యం లేదు! దీంతో జరుగుతున్న నష్టమేంటంటే… జగన్ ప్రసంగాలను ఆలోచనాత్మక దృష్టితో వినాలనే ఫోకస్ తగ్గిపోయి, జగన్ తోపాటూ తామూ మాట్లాడుతున్నామనే సంబరంలోనే చాలామంది ఉండిపోతున్నారు కదా! ఈ పరిస్థితిని వైకాపా వ్యూహకర్తలు ఎలా అర్థం చేసుకుంటున్నారో తెలీదు. జగన్ మాటా జనం మాటా ఒకటే అవుతోందన్న సంబరంలోనే వైకాపా శ్రేణులు ఉంటే.. ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు!