ఏపీ ప్రయోజనాల విషయంలో కేంద్రంలోని భాజపా చేసిన అన్యాయమేంటో ప్రజలందరికీ తెలుసు. ఇక, ప్రతిపక్ష పార్టీగా కేంద్రం వైఖరిపై జగన్మోహన్ రెడ్డి ఎలా స్పందిస్తున్నారో కూడా అర్థమౌతూనే ఉంది. కడప ఉక్కు కర్మాగారం విషయమై కేంద్రం తాజాగా సుప్రీం కోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. సెయిల్ నివేదిక ప్రకారం కర్మాగారం ఏర్పాటు అసాధ్యమన్నదే వారి మాట. దీంతో ఏపీలో నిరసనలు వెల్లువెత్తేసరికి.. పరిశీలనలో ఉందంటూ మాట మార్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైకాపా పత్రిక సాక్షి రియాక్షన్ ఎలా ఉందంటే… భాజపాపై విమర్శలు వస్తున్నాయి కాబట్టి, భాజపాని వెనకేసుకుని రాకూడదు కాబట్టి, పనిలోపనిగా చంద్రబాబును కూడా ఒకేగాటన కట్టేసి విమర్శించేద్దాం అన్నట్టుగా కనిపిస్తోంది.
టీడీపీ బీజేపీ దొంగాట అంటూ, ఆ రెండు పార్టీల కపట నాటకమంటూ సాక్షి కథనం ఇచ్చింది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చెయ్యొద్దని నాలుగేళ్ల కిందటే టీడీపీ, భాజాపాలు కలిసి నిర్ణయించారని రాశారు. కడపకు పరిశ్రమ రాదని తెలిసినా కూడా నాలుగేళ్లపాటు కేంద్రమంత్రి పదవులు టీడీపీ నేతలు అనుభవించారనీ, భాజపాతో స్నేహంగా ఉన్నంతకాలం ఎందుకు ప్రశ్నించలేదనే పాయింట్ తీశారు. కడపలో కనీసం శంకుస్థాపన కూడా జరగలేదనీ, వెనకబడిన ప్రాంతానికి జరిగిన ఈ అన్యాయానికి ఎవరు కారణమంటే టీడీపీ, భాజపాలు అని ప్రజలు ఠక్కున సమాధానం చెబుతారని సాక్షిలో రాశారు. ఓవరాల్ గా చెప్పాలనుకున్నది ఏంటంటే… టీడీపీ, భాజపాలు కలిసి కడప ఉక్కు కర్మాగారాన్ని నిర్లక్ష్యం చేశాయని.
భాజపా విషయంలో వైకాపా రెండు నాలుకల ధోరణి అంటే ఇదే! నాలుగేళ్లు అధికారంలో ఉన్నారూ ఇన్నాళ్లూ ఏం చేశారూ అని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం అనేది ఒకటి ఉందీ అనే కోణం వదిలేస్తున్నారు. దీంతోపాటు, నాలుగేళ్లపాటు ఏపీ విషయంలో కేంద్రం చేసిన నిర్లక్ష్యం అనే యాంగిల్ కూడా టచ్ చెయ్యరు. కేంద్రం పట్టించుకోలేదనే కదా.. భాజపాతో టీడీపీ పోరుకి దిగింది. నాలుగేళ్ల కేంద్ర నిర్లక్ష్యానికి ఫలితమే కదా పోరాటం చేస్తున్నది. లేదంటే, కేంద్రంలోని అధికార పార్టీతో కోరి వైరం కొనితెచ్చుకునే అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏముంది..? పొత్తూగిత్తూ లేని వైకాపానే భాజపా స్నేహం కోసం వెంపర్లాడుతోందే.. అలాంటిది, ఉన్న స్నేహాన్ని టీడీపీ ఎందుకు వదులుకుంటుంది..? కడప కార్మాగారం విషయానికొస్తే… త్వరలోనే నిర్ణయం ఉంటుందని కేంద్రం అంటోంది కదా! నిర్మించి తీరతామని ఇప్పుడు భాజపా నేతలు ప్రకటనలు చేస్తున్నారు కదా! ఆ ప్రకటనల్ని వైకాపాగానీ, వారి పత్రికగానీ ఎందుకు ప్రశ్నించడం లేదు..? ‘త్వరలో’ అంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని ఎందుకు నిలదీయడం లేదు…?
వైకాపా బుద్ధిని జాగ్రత్తగా గమనిస్తే… మామూలుగా అయితే ఆంధ్రాకి కేంద్రం చేయనివన్నీ టీడీపీ ప్రయత్నలోపంగానే ఆ పార్టీ చూపించే ప్రయత్నం చేస్తుంది. కడప ఉక్కు పరిశ్రమ దగ్గరకి వచ్చేసరికి భాజపాని కూడా కలిపి విమర్శించాల్సిన పరిస్థితి వచ్చింది! ఎందుకంటే, రెండు రోజుల తేడాలో రెండు రకాలుగా కేంద్రం మాట మార్చింది. అది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమైంది. కాబట్టి, ఇప్పుడు టీడీపీపై మాత్రమే విమర్శలు చేస్తే బాగుండుదేమోననీ, మధ్యలో భాజపాని కూడా ఉటంకిద్దామనే ఉద్దేశంతో రాసిన కథనంగా ఇది కనిపిస్తోంది.