ఉదయం అనంతపురంలో.. ఆరు నెలల క్రితం ప్రారంభమైన కియా ప్లాంట్‌ను మరో సారి ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డి.. సాయంత్రం ఢిల్లీకి బయలుదేరుతున్నారన్న సమాచారం లీక్ అవగానే… రాజకీయవర్గాల్లో ఒక్క సారిగా..చర్చోపచర్చలు ప్రారంభమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ షెడ్యూల్ చేసుకున్నారని కానీ.. అలాంటి ప్రయత్నాల్లో ఉన్నారన్న ప్రచారం కానీ.. ఉదయం వరకూ లేదు. అనంతపురం పర్యటనకు వెళ్లిన తర్వాతే.. జగన్ ఢిల్లీకి వెళ్తారని.. సీఎంవో వర్గాలు మీడియాకు సమాచారం ఇచ్చాయి. ఇంత హఠాత్తుగా.. జగన్ ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారబ్బా.. అన్న చర్చ సహజంగానే ప్రారంభమయింది.
అధికారిక కార్యక్రమాలు… ప్రధాని మోడీ, అమిత్ షాలతో భేటీ కోసమే… జగన్ ఢిల్లీ వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ ఇరవై ఆరో తేదీన కడపలో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేయాలని… జగన్ నిర్ణయించారు. నిజానికి ఇది.. కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన ప్రాజెక్ట్. దీనికి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు లేకుండానే… శంకుస్థాపన తేదీని ఖరారు చేశారు. ప్రైవేటు, ఏపీ సర్కార్ భాగస్వామ్యంతో అయితే.. గత చంద్రబాబు ప్రభుత్వమే ఓ సారి శంకుస్థాపన చేసింది. కానీ.. జగన్.. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతోనే ప్లాంట్ ను పెట్టాలనుకుంటున్నారు. అందుకే.. శంకుస్థాపనకు.. మోడీని ఆహ్వానించాలన్న ఉద్దేశంతో.. ఢిల్లీకి వెళ్తున్నారంటున్నారు. అయితే.. ముందస్తుగా.. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా… నేరుగా.. ముహుర్తం పెట్టేసి.. ఆనక వచ్చి ఆహ్వానం ఇస్తే.. అది గౌరవం కాదని అంటున్నారు. ఎవరైనా కానీ… ప్రధాని మోడీలాంటి వాళ్లను ఆహ్వానించాలనుకుంటే.. ముందుగా.. సమాచారం ఇచ్చి వారికి వెసులుబాటు ఉన్న తేదీలో శంకుస్థాపనలు పెట్టుకుంటారు. కానీ.. జగన్ దానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారంటున్నారు.
అదే సమయంలో.. గతంలో అమిత్ షాతో భేటీ అయినప్పుడు… పర్సనల్‌గా జగన్ మాట్లాడలేకపోయారు. అమిత్ షా పుట్టిన రోజు నాడే వెళ్లడంతో.. వినతి పత్రం ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి రావడం తప్ప.. ఏమీ చేయలేకపోయారు. ఈ సారి మరింత పర్సనల్‌గా మాట్లాడే అవకాశం కోసం.. అపాయింట్మెంట్ అడిగారని.. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నందున.. అందరూ అందుబాటులో ఉంటారని… కచ్చితంగా సమయం ఇస్తారన్న ఉద్దేశంతో ఢిల్లీ వెళ్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. జగన్ పర్యటన వివరాలు కానీ.. ఆయన భేటీలు కానీ.. మొదటి నుంచి సీక్రెట్‌గానే ఉంచుతున్నారు వైసీపీ నేతలు. ఈ సారి కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తున్నారు.