మున్సిపల్ ఎన్నికల్లో ఊహించనంతగా విక్టరీ లభించడంతో వైసీపీ అధినేత.. సీఎం జగన్కు ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనిపించింది. ఆయన ఏదైనా సందర్భంలో ముందుగా దేవుడి దయ వల్ల అనే మాట ఉపయోగిస్తారు. అది ఆయనకు దేవుడిపై ఉన్న నమ్మకం. ఆ దేవుడెవరు అనే దానిపై బయట రకరకాల చర్చలు జరగవచ్చు కానీ.. మున్సిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత సీఎం జగన్.. తిరుమల దేవుడ్ని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నారు. వెంటనే షెడ్యూల్ ఖరారయింది. మంగళవారం ఆయన తిరుమల చేరుకుంది. ఎల్లుండి ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఆ తర్వాత కొత్తగా నిర్మించిన ప్రసాదాల బూందిపోటును ప్రారంభిస్తారు.
సీఎం జగన్ స్వతహాగా క్రైస్తవుడు అయినప్పటికీ.. హిందూత్వంపై ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలకు ముందు ఆయన హోమాలు చేయించారు. విశాఖ పీఠాధిపతి స్వరూపానందను ఆస్థాన స్వామిజీగా గుర్తించి ఆయన నేతృత్వంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగన్ తిరుమల పర్యటన సందర్భంగా గతంలో డిక్లరేషన్ వివాదాలు రేగినప్పటికీ.. ఆయన అవేమీ పట్టించుకోలేదు. డిక్లరేషన్ ఇవ్వాల్సి నఅవసరం లేదని తేల్చేశారు. సీఎం జగన్ హిందువు కాబట్టి.. డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వైసీపీ నేతలు వాదిస్తూ వచ్చారు. అలాగే సీఎం హోదాలో వెళ్తున్నారు కాబట్టి.. అలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదన్నారు. ఆ వివాదం అప్పుడే సద్దు మణిగింది.
ఇప్పుడు.. సీఎం హోదాలో నేరుగా శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కులు సమర్పించుకున్నా.. ఎలాంటి వివాదం ఉండదు. పైగా ఇప్పుడు… గెలుపు జోష్లో ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పుడు శ్రీవారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించినా.. తర్వాత ప్రత్యేక ప్రార్థనలతో.. తాను చెప్పే దేవుడికి కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఉందంటున్నారు.