ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఫుడ్ ప్రాసెసింగ్ సమస్యను తీర్చడానికి జగన్మోహన్ రెడ్డి మల్టినేషనల్ కంపెనీలతో డీల్ కుదుర్చుకుంటున్నారు. వరుసగా ఆయన బడా కంపెనీలను ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఎంవోయూలను కుదుర్చుకుంటున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఎనిమిది బడా కంపెనీలు.. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇవన్నీ.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పేరెన్నిక గన్నవే. ఇలా ఒప్పందం చేసుకున్న వాటిలో నెదర్లాండ్ ప్రభుత్వం కూడా ఉండటం విశేషం. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీని రైతులకు మరింత ఉపయోపడేలా.. ఆయా సంస్థలు తీర్చిదిద్దనున్నాయి.
అరటికి సంబంధించి ఎన్ఆర్సీ బనానా తిరుచ్చితో ఓ ఒప్పందం చేసుకున్నారు. అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్‌పై పుణెకు చెందిన ఫ్యూచర్‌టెక్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నారు. టమోటా, అరటి ప్రాసెసింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పనపై బిగ్ బాస్కెట్‌తో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మామిడి, చీనీ, మిరప వంటి పంటల ప్రాసెసింగ్‌పై ఐటీసీతోనూ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌లో అత్యంత కీలకమైన ఇంటీరియర్ ఆర్కిటెక్చర్, డిజైన్, ప్యాకేజింగ్, కంటైనర్ల అంశాలపై నెదర్లాండ్స్ ప్రభుత్వంతో, ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ఒప్పందం జరిగింది. రొయ్యలు, చేపల పెంపకంలో టెక్నాలజీ, మార్కెటింగ్ తదితర అంశాలపై ఐఎఫ్‌బీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది. రొయ్యలు, చేపలు ఎగుమతి, రిటైల్ మార్కెటింగ్‌పై అంపైర్ కంపెనీతో ఏపీ ఒప్పందం కుదుర్చుకుంది.
ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెద్ద పెద్ద కంపెనీలతో అనుసంధానం చాలా ముఖ్యమని ..లేకపోతే మార్కెటింగ్ సమస్యలు ఏర్పడతాయని జగన్ భావిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం కాలేజీల్లో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని గతంలోనే నిర్ణయించారు. ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే 7, 8 ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని, ఆ ప్రాసెసింగ్ సెంటర్లలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలనే లక్ష్యంతో కొన్ని రోజులుగా వివిధ సంస్థలతో మాట్లాడుతున్నారు. చివరికి ఒప్పందాలు చేసుకున్నారు. వీటి వల్ల రైతులకు భారీగా మేలు జరగనుంది.