అధికారం ఉంది కదా ప్రతీ దానికి వైఎస్ఆర్ పేరు తగిలించుకున్నారు నాటి ప్రభుత్వ పెద్దలు. ఇప్పుడు వాటిని తొలగించే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి నేరుగా సంబంధం లేకపోయినా వివిధ సంస్థలకు వైఎస్ఆర్ పేరు పెట్టారు. అలాంటి వాటిలో విశాఖలోని అంతర్జాతీయ స్టేడియం ఒకటి. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు చెందిన స్టేడియానికి వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఇప్పుడు ఆ పేరు తొలగిస్తూ ఏసీఏ నిర్ణయం తీసుకుంది.
ఇప్పటి వరకూ డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అనే పేరు ఉండేది. ఇక నుంచి ఏసీఏ-వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా ఉంటుంది. ఈ మేరకు పాలకమండలి నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ మ్యాచులు జరగనున్న సమయంలో ఈ మార్పులు చేశారు. వైఎస్ఆర్ కు క్రికెట్ కు సంబంధం లేదు. స్టేడియానికి..వైఎస్‌కు సంబంధం లేదు. కానీ వైఎస్ చనిపోయిన తర్వాత ప్రతీ దానికి వైఎస్ పేరు పెట్టుకుంటూ పోయారు. విశాఖ స్టేడియానికీ అలాగే పేరు వచ్చి చేరింది.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏసీఏను కూడా విజయసాయిరెడ్డి లాక్కున్నారు. అప్పట్లో గోకరాజు గంగరాజు అధ్యక్షుడిగా ఉండేవారు. ఆయనతో పాటు పాలకమండలి మొత్తాన్ని తప్పించి విజయసాయిరెడ్డి ..తన అల్లుడు, అకౌంటెంట్లకు చాన్సిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విచారణల భయంతో రాజీనామా చేశారు. కేశినేని చిన్ని ఇప్పుడు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.