ఆల్రెడీ ఎన్ టీయార్ జీవితం పై బయోపిక్ లు ప్రకటిచబడ్డాయి. తేజ-బాలయ్య చిత్రం చిన్నపాటి షూటింగ్ (టీజర్ కోసం) కూడా మొదలైంది. వర్మ ప్రస్తుతానికి కిమ్మనడం లేదు. కేతిరెడ్డి వీరగ్రంధం కూడా ఆ మధ్య మొదలైంది. ఇక జయలలిత జీవితం మీద శశిలలిత అనే బయోపిక్ కూడా తీస్తానంటున్నాడు కేతిరెడ్డి . అటు తమిళ్ లో ఎంజీయార్ బయోపిక్ కూడా నడుస్తోంది. పుల్లెల గోపీచంద్ జీవితం ఆధారంగా ప్రవీణ్ సత్తారు సినిమా త్వరలో మొదలవనుంది. ఇక ఇప్పుడు వైఎస్సార్ బయోపిక్ మొదలు కానుంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవితాధారంగా ఓ బయోపిక్ రాబోతోంది. ఇందులో వైఎస్సార్ పాత్రలో ప్రముఖ మలయాళ నటుడు మమ్ముట్టి నటించనున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. గతంలో పూరి జగన్నాథ్, నటుడు రాజశేఖర్‌తో కలిసి వైఎస్సార్ బయోపిక్ తీయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ‘ఆనందో బ్రహ్మ’ లాంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి. రాఘవ్ వైఎస్సార్ బయోపిక్ తెరకెక్కించనున్నారు. ఇందుకు వైసీపీ అధినేత జగన్ కూడా ఒప్పుకున్నట్లు సమాచారం. త్వరలో బయోపిక్కు సంబంధించిన వివరాలను రాఘవ ప్రకటిస్తారట.