తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు ఖాయమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల స్పష్టమైన సందేశాన్ని పంపించారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని తీసుకు వస్తానని ఆమె నల్లగొండ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుతం రాజన్న రాజ్యం లేదని.. అలా ఎందుకు లేదని తాను ప్రశ్నిస్తున్నాన్నానన్నారు. ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలనేది రాజన్న లక్ష్యమని… ప్రస్తుతం తెలంగాణలో ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రతీ పేదవాడికి పక్కా ఇల్లు … ప్రతి విద్యార్థికి విద్య… గొప్పగా ఉద్యోగం చదివేలా చేయాలన్నది రాజన్న రాజ్యంలో కీలమన్నారు. అలాంటి పరిస్థితులు తనతోనే వస్తాయన్నది తన నమ్మకమని షర్మిల తేల్చి చెప్పారు.
ప్రస్తుతం నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడుతున్నానని.. అన్ని జిల్లాల నేతలతో సంప్రదింపులు.. ఆత్మీయ సమావేశాలు నిర్వహించిన తర్వాత పార్టీ ప్రకటన ఉంటుందని… షర్మిల తెలిపారు. అభిమానులందరితో మాట్లాడకుండా తాను పార్టీ ప్రకటన చేయబోనన్నారు. రోజు మార్చి రోజు సంప్రదింపులు జరపాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాల వారీగా వైఎస్ అభిమానుల్ని.. ఆత్మీయుల్ని పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ మేరకు సంప్రదింపు లు పూర్తయ్యే లోగా.. పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి..ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
గత నెలలో ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే చెప్పినట్లుగానే.. షర్మిల తన రాజకీయ అడుగులు వేస్తున్నారు. రాజన్న రాజ్యం అనే బ్రాండ్‌నే..తన రాజకీయ అడుగులకు అస్త్రంగా వాడుకుంటున్నారు. చూస్తూంటే.. షర్మిల ఈ రాజకీయ వ్యూహం అంతా… ఆర్కేతో కలిసి కూర్చుని రచించినట్లుగా ఉందన్న అనుమానాలు కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ విషయంలో తదుపరి అడుగులు కూడా ఆర్కే చెప్పినట్లుగా జరిగితే… ఏపీలో కూడా షర్మిల పార్టీ అడుగుపెట్టడం ఖాయమని చెప్పుకోవచ్చు.