పాదయాత్రలో రాజకీయ విమర్శలు అంటే వాడు, వీడు అంటూ దారుణంగా మాట్లాడటమే అన్నట్లుగా సాగుతున్న షర్మిల పాదయాత్రకు మహబూబాబాద్‌లో మరోసారి బ్రేక్ పడింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై శనివారం దారుణమైన వ్యాఖ్యలను షర్మిల చేశారు. దీంతో శంకర్ నాయక్ భార్య షర్మిల టెంట్ ముందు ధర్నాకు దిగారు. ఆయన అనుచరులు ప్లెక్సీలు ఇతర వాటిని ధ్వంసం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును షర్మిలపై నమోదు చేసిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ తరలించారు. అరెస్ట్ చేస్తారా లేకపోతే ఇంటి దగ్గర వదిలి పెడతారా అన్నది స్పష్టత రావాల్సి ఉంది.
షర్మిల మొదట్లో పాదయాత్ర ప్రారంభించినప్పు డు రాజకీయ విమర్శలే చేసేవారు. అయితే ఎవరూ పట్టించుకోవడం లేదన్న కారణంగా తర్వాత బూతులందుకోవడం ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతలు ఆమెపై పద్దతిగానే స్పందిస్తున్నారు. అయినా ఆమె మాత్రం అసభ్యంగా తిడుతున్నారు. ఇతర ఎమ్మెల్యేల సంగతేమో కానీ.. ఎస్టీ ఎమ్మెల్యే అయిన శంకర్ నాయక్ పైనా అదే భాష ప్రయోగించడంతో కేసయింది. పాదయాత్ర అనుమతి రద్దు చేసినట్లుగా నోటీసులు ఇచ్చారు.
నిజానికి ఇలాంటి ఎఫెక్టుల కోసమే షర్మిల ప్రయత్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. గతంలో ఇలాగే తన పాదయాత్రలో బీఆర్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడంతో ఆమె హైదరాబాద్‌లో చాలా సీన్ క్రియేట్ చేశారు. దాని వల్ల పెద్ద ఎత్తున ప్రచారం లభించిందని అనుకుంటున్న ఆమె.. ఇదే స్ట్రాటజీని రెండో విడత పాదయాత్రలోనూ అవలంభిస్తున్నారని అంటున్నారు. అయితే శంకర్ నాయక్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు సమర్థించుకోలేనంతగా ఉండటంతో షర్మిల అరెస్ట్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు.