వైఎస్ కుమార్తె షర్మిల .. తన అన్న జగన్పై నేరుగా మండిపడ్డారు. వైఎస్ఆర్ను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు తీేసి .. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్శిటీ అని పేరు పెట్టాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారు. ఈ నిర్ణయం కరెక్ట్ కాదని షర్మిల స్పష్టం చేశారు. ఈ అంశంపై తన స్పందనను మీడియాకు తెలియచేసిన ఆమె.. జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల వైఎస్ఆర్ కు అవమానం జరుగుతుందన్నారు.
ఒక ప్రభుత్వం పెట్టిన పేరును..మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనని ఆమె స్పష్టం చేశారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనన్నారు. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు…రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించి నట్లే కదా అని ప్రశ్నించారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదని.. YSR కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదని షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు. YSR చనిపోతే ఆ భాద తట్టుకోలేక 700 వందల మంది చనిపోయారు.. అలాంటి ఖ్యాతి ఉన్న వైఎస్సార్ కి ఇంకొకరి ఖ్యాతి అవసరం లేదని స్పష్టం చేశారు.
ఓ కుమార్తెగా తనను నాన్న ప్రేమించినంతగా ఎవరిని ప్రేమించలేదని.. ఈ ప్రపంచంలో నేను నాన్నను ఆరాదించినట్లుగా ఎవరు ఆరాధించి ఉండరని ఆమె ప్రకటించారు. షర్మిల స్పందన సూటిగా సుత్తి లేకుండా ఉండటంతో అసెంబ్లీలో పేరు మార్పు కోసం జగన్ చేసిన సమర్థన.. బయట వైసీపీ నేతలు చేస్తున్న వాదనలు తేలిపోతున్నట్లు అయ్యాయి. కొంత కాలంగా జగన్కు.. ఆయన సోదరి షర్మిల మధ్య సత్సంబంధాలు లేవు. అయితే ఎప్పుడూ నేరుగా జగన్ ను టార్గెట్ చే్యలేదు. తొలి సారి ఆయన నిర్ణయంపై మండిపడ్డారు.