రాజకీయమే చేయాలనుకుంటే ఎప్పుడైనా చేసుకోవచ్చు. అందుకు ప్రత్యేకమైన సమయమేమి ఉండదు. అలా అని, అన్నిసార్లు రాజకీయమే చేస్తే ప్రజల చేత ఛీ కొట్టించుకోవడం ఖాయం. ఏదైనా విషాదం నెలకొన్న సమయంలో ఆయా రాజకీయ పార్టీలు ఆదిలో మానవీయ కోణంలో స్పందించడం,ఆ తర్వాతే రాజకీయాల గురించి మాట్లాడటం పరిపాటి. కాంగ్రెస్ హైకమాండ్ కూడా పహల్గం ఉగ్రదాడి నేపథ్యంలో రాజకీయ అంశాల కన్నా.. దేశంపై జరిగిన దాడిని ఖండించడం, మృతులకు సహకారంపైనే మాట్లాడుతోంది.
రాజకీయం ఎలా చేయాలో నేర్చుకోలేక ప్రత్యర్థికి అవకాశం ఇస్తున్న రాహుల్ గాంధీలాగే…షర్మిల కూడా తయారు అవుతున్నారు. పహల్గంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఆమె ప్రధాని మోడీని టార్గెట్ చేశారు. ఆయన్ను ఇంటర్నల్ టెర్రరిస్ట్ అని అభివర్ణించారు. పదవులకు రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. నిఘా వ్యవస్థ లోపం వల్లే ఈ దాడి జరిగిందని ఆరోపించిన ఆమె ఆయన బీజేపీకి చౌకీదార్ అని, దేశానికి కాదని.. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని షర్మిల ఫైర్ అయ్యారు. ఈ ఘటన మతం రంగు కూడా పులుముకుంటున్న నేపథ్యంలో షర్మిల… మృతుల్లో ఒకరు ముస్లిం కూడా ఉన్నారని చెప్పుకొచ్చారు.
నిజానికి ఈ విషాదంతో దేశం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ దాడిని పాక్ ప్రేరేపిత ఉగ్రదాడిగా యావత్ దేశం పేర్కొంటుంది. ప్రపంచ దేశాలు కూడా ఈ వాదనతో జత కల్పుతున్నాయి. దీంతో పాక్ కు ఊపిరి ఆడకుండా చేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు తీసుకుంటుంది. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో దాయాది దేశానికి ఊపిరి సల్పడం లేదు. అయితే, ప్రస్తుత విషాద సమయంలో షర్మిల కేంద్రానికి సూచనలు చేయడం మానేసి, విమర్శలపై గురి పెట్టడం చూసి కాంగ్రెస్ వర్గాలే ఆశ్చర్యపోతున్నాయి. ఉగ్రవాద కట్టడికి ఎలాంటి చర్యలు చేపట్టకుండా విషాద సమయంలో రాజకీయం చేసేందుకు ఆమె ఇంట్రెస్ట్ చూపడం వివాదాస్పదం అవుతోంది.
ఇప్పటికే పాక్ విషయంలో ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మోడీ కీలెరిగి పాక్ కు వాత పెట్టారని వాదనలు వినిపిస్తున్నాయి. వీటిని పసిగట్టకుండా, కేంద్రానికి సూచనలు చేయకుండా రాజకీయమే మా విధి, మోడీని నిందించడమే మా పని అంటూ షర్మిల టార్గెటెడ్ పాలిటిక్స్ చేస్తున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే ఆమె ఇకనైనా ఎలా రాజకీయం చేయాలో నేర్చుకోవాలి అంటూ సెటైర్లు పేలుతున్నాయి.