జగన్ రెడ్డి నీడ నుంచి విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. జగన్ రెడ్డి చెప్పినా సరే రాజీనామా చేశానన్నారు. అబద్ధాలు చెప్పలేక రాజీనామా చేశానని ఆయన అంటున్నారు… అందుకే ఇక నుంచి పూర్తిగా నిజాలు చెప్పాలని ఎక్కువ మంది పట్టుబడుతున్నారు. వారిలో టీడీపీ నేతలే కాదు వైఎస్ కుమార్తె షర్మిల కూడా ఉన్నారు. జగన్ రెడ్డి ఏది చెబితే అది చేశారని ఇప్పటికైనా నిజాలు చెప్పాలని ఆమె అంటున్నారు. వైఎస్ వివేకా హత్య కేసు దగ్గర నుంచి తమ ఆస్తుల వివాదం వరకూ విజయసాయిరెడ్డి చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయని ఎక్కువ మంది భావన.
చెల్లి, తల్లిపై జగన్ ఎన్సీఎల్టీలో కేసు వేసిన తరవాత లేఖల వార్ జరిగింది. అందులో షర్మిల తన తండ్రి వైఎస్ పంచిన ఆస్తుల విషయం.. వాటికి సాక్ష్యంగా విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్న విషయాన్ని వెల్లడించారు. అయితే విజయసాయిరెడ్డి షర్మిల చేసిన వ్యాఖ్యల్ని ఖండించి పసుపుచీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్లారని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ విషయంతో పాటు వైఎస్ వివేకా హత్య గురించి సమగ్ర సమాచారం విజయసాయిరెడ్డికి తెలుసు. ఆయన చెప్పడం లేదని షర్మిల అనుకుంటున్నారు. ఇలా అన్ని విషయాలు చెప్పాలని కోరుకుంటున్నారు.
తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకుంటోంది. ఆయన అప్రూవర్ గా మారాలని .. అనుకుంటున్నారు. జగన్ రెడ్డి ప్రతి అక్రమ పైసా ఎక్కడ కూడబెట్టారో.. ఎలా హవాలా అయిందో విజయసాయిరెడ్డికి తెలుసు. ఐదేళ్ల కాలంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు దోచేసిన డబ్బులన్నీ ఎలా బదిలీ అయ్యాయో.. ఎక్కడ ఉన్నాయో ఆయనకు తెలుసు. ఇప్పటికైనా నిజాలు చెప్పాలని ఆయనను అంందరూ కోరుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి చెప్పే అవకాశాలు కనిపించడం లేదు.