సొంత రాజకీయం కోసం కొత్త తరం అవతార నేతలు ఎంతకైనా దిగజారిపోతారని పదే పదే రుజువు చేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్ కుటుంబసభ్యులు ఈ విషయంలో ఒకరిని మించి ఒకరు … అంటున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఓ వైపు జగన్ వ్యవహారశైలి ఏపీలో అందరూ ఆశ్చర్యంగా చూస్తూండగానే .. తెలంగాణలో షర్మిల అదే విధంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఆమె కాంగ్రెస్ పార్టీపై దారుణమైన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి బతికి ఉంటే కాంగ్రెస్ పార్టీపై ఉమ్మేసేవారని చెప్పుకొచ్చారు. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ కుటుంబం ఎదిగింది కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద. అప్పుల్లో ఉన్న కుటుంబం వేల కోట్ల ఆస్తులు సంపాదించుకుంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాల మీద. వైఎస్ఆర్ పార్టీ హైకమాండ్‌కు ఎంత విధేయంగా ఉండేవారో కథలు కథలుగా చెబుతారు. పార్టీ గురించి ఆయన ఎక్కువగా ఆలోచించేవారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే తమ లక్ష్యమనేవారు. చనిపోయే వరకూ ఆయన కాంగ్రెస్ పార్టీనే. మరో ఆలోచన చేయలేదు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన పదవి ఇవ్వలేదని కుటుంబం మొత్తం కాంగ్రెస్ పార్టీపై పగబట్టింది. ఇప్పుడు ఏకంగా ఉమ్ముల గురించి మాట్లాడేస్తున్నారు.
మామూలుగా మూలాలు మర్చిపోతే పతనం ఖాయమని అంటూంటారు. కానీ రాజకీయ నేతలు మాత్రం తమ మూలాలు గుర్తుంచుకునే పతనమవుతూంటారని అనుకుంటారు. అందుకే ఎన్టీఆర్ భిక్షతో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పటికీ పదవులు అనుభవిస్తున్నా.. ఆయనను తూలనాడతారు. ఏ పార్టీతో తాము ఈ స్థితిలో ఉన్నామో తెలిసి కూడా ఆ పార్టీపై ఖండ్రించి ఉమ్మేస్తామని సులువుగా మాట్లాడేస్తున్నారు. రాజకీయాల్లో విలువులు అనేవి ఉండవనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.