చిన్నారి హత్యాచార ఘటన విషయంలో పొలిటికల్ చాంపియన్గా నిలవాలని ప్రయత్నించిన వైఎస్ షర్మిల వ్యూహం బెడిసికొట్టింది. పరామర్శకు వెళ్లి అక్కడిక్కకడే దీక్షకు కూర్చోవాలని అలవి కానీ డిమాండ్లను చేయాలని ఎవరు సలహాలు ఇచ్చారో కానీ ఆమె పక్కాగా ఫాలో అయ్యారు. కానీ తెలంగాణ రాజకీయ పరిస్థితులు.. ఆ ఘటన నేపధ్యం .. రాజకీయం చేస్తే ఎదురయ్యే విమర్శలు లాంటి వాటిని ఆ వ్యూహాకర్తలు ప రిగణనలోకి తీసుకోలేదు. ఫలితంగా షర్మిలకు దీక్ష చెడ్డా ఫలితం దక్కని పరిస్థితి ఏర్పడింది.
హత్యాచారానికి గురైన కుటుంబానికి రూ. పది కోట్ల నష్టపరిహారం, సీఎం కేసీఆర్ స్పందించే వరకూ తాను సింగరేణి కాలనీలో దీక్ష చేస్తానని ప్రకటించిన వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలను పోలీసులు ఇంటికి పంపేశారు. అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు ఆమెను దీక్ష నుంచి తరలించారు. పెద్దగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరూ లేకపోవడం ఉన్న వారు కూడా పోలీసులు ఎప్పుడు తరలిస్తారా అన్నట్లుగాఎదురు చూడటంతో పెద్దగా ఇబ్బంది లేకుండా తరలించారు. దీంతో ఆమె చిన్నారి కుటుంబానికి మేలు చేయాలంటూ చేసిన ఏ డిమాండూ నెరవేరలేదు.
చిన్నారి కుటుంబాన్ని పరామర్శిస్తానంటూ వెళ్లిన షర్మిల తర్వాత అనూహ్యంగా అక్కడే దీక్షచేయాలని కూర్చున్నారు. ఇతర రాజకీయ పార్టీల నేతలు వస్తున్నా ఆమె మాత్రం అక్కడ్నుంచి కదల్లేదు. విషయం రాజకీయం అవడంతో ఆ రాజకీయంలో తానే చాంపియన్ కావాలనుకున్నారు. అనుకున్నట్లుగానే దీక్షకు కూర్చున్నారు. ఇతర రాజకీయ నేతలు పరామర్శకు రాకుండా తనదే షో అనుకున్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రకటన చేసినా.. నిందితుడు దొరికినా కావాల్సినంత పబ్లిసిటీ చేసుకోవచ్చనుకున్నారు. కానీ అలాంటివేమీ లేకుండా ఇంటికి వెళ్లిపోవాల్సి వచ్చింది.
షర్మిల ఇలా దీక్షకు కూర్చుకుని విపరీతమైన వ్యాఖ్యలు చేయడం… అనూహ్యమైన డిమాండ్లు చేయడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించినట్లయింది. అయితే ఈ విషయంలో ఆమెకు ప్రశంసల కన్నా రాజకీయం అనే విమర్శలే ఎక్కువ ఎదుర్కొంటోంది. చిన్నారి హత్యతో రాజకీయ మైలేజీ సాధించాలనే ప్రయత్నం చేశారని.. అందరూ చేస్తున్నా షర్మిల మాత్రం గీత దాటారన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.