హైదరాబాద్‌లోని సింగరేణి కాలనీలో జరిగిన చిన్నారిపై హత్యాచార ఘటన విషయంలో రాజకీయాలు పీక్స్‌కు చేరుతున్నాయి. ఆ ఘటనపై రాజకీయ పరామర్శలు ఓ రేంజ్‌కు వెళ్తున్నాయి. నాలుగైదు రోజుల పాటు పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం సింగరేణి కాలనీ పొలిటికల్ హాట్ స్పాట్ అయిపోయింది. అన్ని పార్టీల నేతలు రోజూ వెళ్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వెళ్లారు. అయితే అందరూ వెళ్లి పరామర్శించి వెళ్లిపోయారు. కానీ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మాత్రం అక్కడే దీక్షకు కూర్చున్నారు.
బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె .. ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందించాలని… బాధిత కుటుంబానికి రూ.10 కోట్ల పరిహారం ప్రకటించాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. అప్పటి వరకూ దీక్ష విరమించబోనని ప్రకటించారు. బాధితురాలి ఇంట్లోనే కూర్చున్నారు. తెలంగాణను మద్యం. డ్రగ్స్ అడ్డాగా మార్చారని.. ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని ఆరోపించారు.
దీక్షలు చేయడంలో షర్మిల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి మంగళవారం ఒక్కో చోట ఉద్యోగ దీక్షలు చేస్తున్న ఆమె.. అంది వచ్చిన రాజకీయ అవకాశాలను కూడా పక్కాగా ఉపయోగించుకుంటున్నారు. సింగరేణి కాలనీకి రోజు నాయకులు పరామర్శకు వస్తున్నారు కానీ అక్కడే షర్మిల దీక్షకు కూర్చుంటుందని పోలీసులు కూడా ఊహించలేకపోయారు.