షర్మిలను కాంగ్రెస్ పార్టీ అసలు పట్టించుకోవడం లేదు. ఆమె మద్దతు కూడా కోరలేదు. అయినా ఆమె తన మద్దతు ప్రకటించి పోటీ నుంచి విరమించుకున్నారు. పోటీ చేసి ఉంటే.. ఆమెకు కూడా పాలేరులో నాలుగైదు వందల ఓట్లు వచ్చి ఉండేవి కావు. కానీ ఆమె తాను కాంగ్రెస్ పార్టీని గెలిపించేస్తున్నానని.. తాను పోటీ చేసి ఉంటే కాంగ్రెస్ ఓడిపోయి ఉండేదని గప్పాలు కొట్టుకుంటూ మీడియా ముందుకు వచ్చారు. అంతే కాదు కాంగ్రెస్ అంతర్గత విషయాల్లో తన అభిప్రాయం చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీ వైపు షర్మిల రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. ఆమె అసలు పార్టీ ఎందుకు పెట్టింది.. ఎందుకు కాంగ్రెస్ లో విలీనం కోసం ప్రయత్నించారు.. చివరికి వద్దన్నా ఎందుకు కాంగ్రెస్ ను పట్టుకుని వేలాడుతున్నారో రేవంత్ కు ఓ స్పష్టత ఉంది. అందుకే ఆమె నీడ కాంగ్రెస్ పై పడకుండా చేసుకున్నారు. ఇప్పుడు ఆమె రేవంత్ సీఎం ఎలా అవుతారన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఉత్తమ్ అన్న.. భట్టి విక్రమార్క అన్న బాగా కష్టపడ్డారని.. ఇతరులలా కార్లలో హెలికాఫ్టర్లలో తిరగలేదని కామెంట్ చేస్తున్నారు.
రేవంత్ సీఎం అయితే షర్మిలకు వచ్చే కష్టమేంటో ఎవరికీ అర్థం కాదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ నేత కాదు. ఆమె వల్ల ఏదైనా ఉపయోగం ఉందనుకుంటే.. ఖచ్చితంగా ముందుగానే పార్టీలో విలీనం చేసుకునేవాళ్లు. కనీసం ఏపీలో అయినా ఉపయోగం ఉంటుందని అనుకోవడం లేదు. ఇప్పుడు ఆమెను పార్టీలో చేర్చుకునే అవకాశమే ఉండదు. అయినా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని వేలాడుతూనే ఉన్నారు. ఇప్పుడు షర్మిల పార్టీకి ఓ కార్యకర్త కూడా లేరు.
షర్మిల కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకునే పార్టీ పెట్టారన్న అనుమానాలు .. ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి. ఏం ఆశించి ఇలా చేస్తున్నారోనని కాంగ్రెస్ వర్గాలు కూడా సెటైర్లు వేస్తున్నాయి.