వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టిన రోజైన జూలై ఎనిమిదో తేదీన పార్టీని ప్రారంభించబోతున్నట్లుగా వైఎస్ షర్మిల ప్రకటించారు. పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత తొలి సారిగా ఖమ్మంలో బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పద్దెనిమిదేళ్ల కిందట.. ఏప్రిల్ తొమ్మిదో తేదీనే తెలంగాణలోని చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించారని.. ఇప్పుడు తాను రాజకీయంగా తాను కూడా తెలంగాణలో రాజకీయ అడుగుల ప్రస్థానం ప్రారంబించబోతున్నానని ప్రకటించారు. జూలై ఎనిమిదో తేదీన పార్టీ పేరు, జెండా, అజెండా అన్నీ ప్రకటించబోతున్నట్లుగా వైఎస్ అభిమానులకు షర్మిల తెలిపారు.
అయితే తన రాజకీయ పోరాటం మాత్రం ప్రారంభమైందని ప్రకటించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేదన్న షర్మిల… ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కేసీఆర్ ప్రభుత్వాన్ని నిద్రలేపడానికి ఆందోళనలు చేస్తాంమని.. 15 నుంచి నిరాహారదీక్షలు చేస్తామన్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్లో నిరాహారదీక్షకు దిగుతానని… నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే వరకు దీక్షలు చేస్తూనే ఉంటామన్నారు. ఎవరు ఏమన్నా తాను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డనేనని.. ఇక్కడ గాలి పీల్చా.. ఇక్కడి నీళ్లు తాగానని .. ఈ గడ్డమీదే బతికా.. రుణం తీర్చుకోవాలనుకోవడం తప్పా అని షర్మిల ప్రశ్నించారు. బరాబర్ తెలంగాణలో నిలబడతా.. ప్రజల కోసం కొట్లాడతానని.. అవకాశం ఇవ్వాలో లేదో ప్రజలు నిర్ణయిస్తారని షర్మిల తేల్చి చెప్పారు.
అంతకు ముందు షర్మిల తల్లి విజయలక్ష్మి మాట్లాడారు. షర్మిల రాజకీయ ప్రస్థానానికి తొలి అడుగు ఖమ్మం నుంచి వేయడం అభినందనీయమన్నారు. ఎంతకాలం బతికామన్నది ముఖ్యం కాదు.. ఎలా బతికామన్న విషయమే ముఖ్యమని షర్మిలకు వైఎస్ఆర్ నేర్పించారన్నారు. వైఎస్ లాగా విలువలను పుణికిపుచ్చుకున్న షర్మిల ఇక తెలంగాణకు అంకితమని.. తన బిడ్డను ఆశీర్వదించాలని విజయలక్ష్మి కోరారు.
అంతకు ముందు ఉదయమే హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి ర్యాలీగా ఖమ్మం బయలుదేరారు. మధ్యలో సూర్యాపేటలో షర్మిల పార్టీ కోసం కీలకంగా పని చేస్తున్న పిట్ట రాంరెడ్డి అనే నేత ఇంట్లో కాసేపు సేదదీరారు సాయంత్రం ఏడుగంటల సమయంలో వేదికపైకి వచ్చారు. లక్ష మందిని సమీకరిస్తామని… ఆ పార్టీ నాయకులు చెప్పారు కానీ.. పట్టుమని పది వేల మందిని కూడా సమీకరించలేకపోయారు.