తెలంగాణలో పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తామని పాదయాత్ర చేస్తున్న షర్మిలపై అక్కడి రాజకీయ నేతలు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. మంత్రి నిరంజన్ రెడ్డి ఆమెను ” మంగళవారం మరదలు ” అని సంబోధించారు. అది సోషల్ మీడియాలో వైరల్ అయింది. షర్మిలకు నిక్ నేమ్గా ” మంగళవారం మరదలు ” అని పేరు పెట్టి తెలంగాణ వాదులు.. ఇతర పార్టీల నేతలు పోస్టులు చేయడం ప్రారంభించారు. ఉద్యోగాల భర్తీకి డిమాండ్ చేస్తూ షర్మిల ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహారదీక్ష చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇలా నిరంజన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఆయన అంత మాట అన్నా ఎవరూ ఖండించలేదు. చివరికి వైఎస్ఆర్టీపీ తరపున పది మందిని తీసుకెళ్లి మంత్రుల క్వార్టర్స్ వద్ద ఓ మహిళా నేత ధర్నా చేశాం అనిపించారు. అది కూడా ఎవరి దృష్టికి రాలేదు. నిరంజన్ రెడ్డిని అంత కంటే దారుణంగా తిడితే కవర్ అవుతుందని ఓ మహిళా నేతతో తిట్టించారు. కానీ ముక్కూముఖం తెలిసిన నేత కాకపోవడంతో మడియా కూడా పట్టించుకోలేదు. ఇక తప్పదనుకుని నేరుగా షర్మిలనే నిరంజన్ రెడ్డిని తిట్టారు. ” ఈ కుక్కకు కవిత ఏమవుతుంది?” అని ప్రశ్నించారు. ఆమె మాటలకూ పెద్దగా మైలేజీ వచ్చినట్లుగా కనిపించడం లేదు.
తెలంగాణలో కుప్పలు, తెప్పలుగా వైఎస్ ఫ్యాన్స్ ఉన్నారని వారే తన బలం అని షర్మిల చెప్పుకుంటూ పార్టీ పెట్టారు. అయితే ఆమెపై మంత్రి ఒకరు దారుణమైన వ్యాఖ్యలు చేస్తూ ఒక్కరూ ముందుకొచ్చి ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు. షర్మిలకు సపోర్ట్ చేయలేదు. పాదయాత్రలో ఉంటున్న వారిలో ఎవరూ తెలంగాణ వారు లేరని .. అడ్డా కూలీలతో యాత్ర నిర్వహిస్తున్నారని ఇప్పటికే ఇతర పార్టీలు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడు ఆమెపై దారుణమైన వ్యాఖ్యలు చేసి అవమానిస్తున్నారు. ఈ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలనో షర్మిల పార్టీకి అంతుబట్టకుండా ఉంది.