తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్న వైఎస్ షర్మిలను… అమరావతి రైతులు మెల్లగా ఆంధ్రప్రదేశ్ వైపు లాగే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణలో ఆమె ఇస్తున్న స్టేట్మెంట్లు చూసి.. అలాంటి బాధలే పడుతున్న తమను కూడా.. ఆదుకుంటుందన్న ఉద్దేశంతో.. తమ కోసం పోరాటం చేస్తుందన్న ఆశతో… వారు ఆమెకు విజ్ఞప్తులు పంపుతున్నారు. తమ ఆవేదన వినాలని షర్మిలకు అమరావతి మహిళా రైతులు ప్రత్యేకంగా వీడియో విడుదల చేశారు. తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని.. తమకు మద్దతుగా ఏపీలోనూ పోరాడాలని కోరుతున్నారు. షర్మిలకు వారు పంపుతున్న సందేశాలు చాలా స్పష్టంగా.. క్లియర్గా ఉంటున్నాయి.
2019లో మా అన్నకి ఓటేయండి రామన్న రాజ్యం వస్తుందని షర్మిల తమ గ్రామాలకు వచ్చి ప్రచారం చేశారని గుర్తు చేస్తున్నారు.
షర్మిల చెప్పినట్లుగా రాజన్న రాజ్యం రాలేదని.. రావణరాజ్యం వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం అని షర్మిల ప్రకటన ను ఆహ్వానిస్తున్నామన్న అమరావతి మహిళా రైతులు… ఏపీలో కూడా రాజన్న రాజ్యం రావాలని కోరుకుంటున్నామని.. అందుకు నడుంబిగించాలంటూ విజ్ఞప్తి చేశారు. నిజానికి అమరావతి వివాదం ప్రారంబమైన తర్వాత ఒక్క సారి అంటే.. ఒక్క సారి కూడా షర్మిల తన అభిప్రాయాన్ని చెప్పలేదు. పోలీసులు దాడులు చేసినప్పుడు కానీ.. అక్రమ కేసు పెట్టినప్పుడు కూడా ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. కానీ ఇప్పుడు.. తెలంగాణలో ఆమె చెబుతున్న మాటలు.. అమరావతి రైతుల్ని ఆకర్షిస్తున్నాయి.
తమ కోసం పోరాటం చేస్తారన్న ఆశాభావంతో అమరావతి రైతులు ఉన్నారు. అయితే తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్న షర్మిల.. ఏపీ వైపు చూస్తారా.. కనీసం స్పందిస్తారా అన్నది ఆసక్తికరమైన అంశం. ఒక వేళ.. అమరావతి రైతులకు మద్దతుగా షర్మిల చిన్నపాటి ప్రకటన చేసినా అది రాజకీయ పరంగా సంచనాత్మకం అవుతుందనడంతో సందేహం ఉండదు. మరి షర్మిల ఏం చేస్తారో..?