వైఎస్ షర్మిల తన కుమారుడి పెళ్లికి రావాలని అందర్నీ పిలుస్తున్నారు. గతంలో ఎప్పుడూ కనీసం పలకరింపులు కూడా ఉండని నేతల్ని వెళ్లి కలుస్తున్నారు. తాజాగా చంద్రబాబు ఇంటికి వెళ్లి మరీ ఆయనను కుమారుడి పెళ్లికి ఆహ్వానించారు. ఇరవై నిమిషాల సేపు మాట్లాడారు. వైఎస్ తో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారని షర్మిల తెలిపారు. రాజకీయాలు మాట్లాడలేదన్నారు. తప్పనిసరిగా పెళ్లికి వస్తానని చెప్పారన్నారు.
చంద్రబాబుతో భేటీ సందర్భంగా షర్మిల పసుపు కలర్ బోకేను తెచ్చి ఇచ్చారు. బయట మీడియాతో మాట్లాడినప్పుడు చంద్రబాబు రాజకీయంగా ప్రత్యర్థులే కానీ శత్రువులు కాదన్నారు. ఫ్రెండ్లీ పాలిటిక్స్ ఉండాలని చెప్పుకొచ్చారు. నిజానికి షర్మిలకు ఇప్పుడు కష్టం వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు చెబుతున్నారుక కానీ.. జగన్ రెడ్ిడ చేసేదంతా కక్ష సాధింపు రాజకీయాలే్. అవి ఆమె మీదకు వచ్చే సరికి.. ఫ్రెండ్లీ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారన్న విమర్శలు సహజంగానే వస్తాయి. అయితే ఇప్పుడు షర్మిలతో ఎవరికీ పంచాయతీ లేదు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏ బాధ్యతలు చేపడతారో స్పష్టత లేదు.
కానీ జగన్మోహన్ రెడ్డిని పిలిచినప్పుడు ఒక్క ఫోటో కానీ వీడియో కానీ బయటకు రాలేదు. అసలు జగన్ కలిశారా లేదా అన్నది కూడా ఎవరికీ తెలియదు. ఆహ్వానపత్రిక అందించానని సానుకూలంగా స్పందించారని మాత్రం షర్మిల తెలిపారు. ఏదో సమ్మె చేస్తున్న కార్మికులకు భరోసా ఇచ్చినట్లుగా సానుకూలంగా స్పందించడం ఏమిటన్న ప్రశ్నలు సహజంగానే వస్తాయి. వచ్చాయి కూడా. ఇప్పుడు చంద్రబాబుతో భేటీ విషయంలో ఫోటోలు, వీడియోలు అన్నీ బయటకు వచ్చాయి. చంద్రబాబు ఇంటి బయట మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు తన కుమారుడి పెళ్లికి వస్తానని చెప్పారన్నారు.
షర్మిల కుమారుడి పెళ్లి రాజకీయంగానూ కలకలం రేపుతోంది. పెళ్లికి జగన్ వెళ్తారా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. మరో నాలుగు రోజుల్లో నిశ్చితార్థం జరగనుంది. దానికి జగన్ హాజరవుతారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.