మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సెప్టెంబర్ 2009లో మరణించారు. ఇంచుమించు అదే సమయంలో ఆయన మరణాన్ని తట్టుకోలేక చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడమో లేక గుండెపోటుతో మరణించడమో జరిగిందని వైకాపా చెపుతోంది. ఇది జరిగి ఇప్పటికి ఆరు సం.లు కావస్తోంది. కానీ నేటికీ షర్మిల పరామర్శ యాత్రాల పేరిట ఆరేళ్ళ క్రితం చనిపోయినవారిని గుర్తుచేసి మరీ వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం చాలా విడ్డూరంగా ఉంది. ఈరోజు ఆమె తెలంగాణాలో వరంగల్ జిల్లాలో ఓదార్పు యాత్ర కొనసాగిస్తున్నారు. తన అన్న జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడే తను పరామర్శ యాత్ర చేస్తున్నానని, దానికి ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని ఆమె చెప్పుకొంటున్నారు.
మంచిదే! అటువంటప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న వైకాపా నేతలు, కార్యకర్తలు ఆమె యాత్రకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వరులు ఎందుకు పిలుపునిచ్చినట్లు? ఒక కుటుంబాన్ని ఓదార్చడానికి జిలా వ్యాప్తంగా నున్న కార్యకర్తలు అవసరమా? ఆమె చేస్తున్నది పరామర్శయాత్ర. దానిని విజయవంతం చేయదానికి కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలిరమ్మని కోరదానికి అర్ధం ఏమిటి? అని ప్రశ్నించుకొంటే, ఆమె చేస్తున్న ఈ పరామర్శ యాత్ర తెలంగాణాలో వైకాపాను బలోపేతం చేసుకోవడానికి చేస్తున్నరాజకీయ యాత్రగానే ఆపార్టీ పరిగణిస్తున్నట్లు స్పష్టం అవుతోంది. అందుకే దానిని ఆమె వ్యక్తిగత కార్యక్రమంగా కాక వైకాపా కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్లు అర్ధమవుతోంది.
ఒకవేళ ఈవిధంగా తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవాలనుకొంటే ఎవరూ అభ్యంతరం చెప్పడానికి లేదు. కానీ ఇదే పని ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే పార్టీ నేతలు, కార్యకర్తలలో రాష్ట్రంలో పార్టీ గట్టిగా నిలబడి ఎన్నికలలో పోటీ చేసి అధికారం కోసం ప్రయత్నిస్తుందనే నమ్మకం ఏర్పడి ఉండేది. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లోనే ఉంటున్నప్పటికీ ఆయన ఇంతవరకు తెలంగాణాలో పర్యటించలేదు! బహుశః తెరాసతో తన సంబందాలను పణంగా పెట్టడం ఇష్టం లేకనే ఆయన తెలంగాణాలో పర్యటించడం లేదేమో? తెలంగాణాలో పార్టీని బలోపేతం చేసుకోవడం కంటే తెరాసతో సత్సంబందాలు కలిగి ఉండటానికే ఆయన ప్రాధాన్యం ఇస్తున్నట్లుంది. మరి అటువంటప్పుడు వైకాపాని నమ్ముకొన్న నేతలు, కార్యకర్తల పరిస్థితి ఏమిటి? వారి రాజకీయ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోంది? అని ప్రశ్నించుకొంటే ఇంతకు ముందు రాష్ట్రంలో వైకాపా కోసం పనిచేసిన కొండా సురేఖ వంటి వారికి ఎదురయిన పరిస్థితే ఎదురవవచ్చును. తెరాస ప్రభుత్వంతో పోరాడకుండా, దానికి తాము మిత్రపక్షమని గట్టిగా చెప్పుకోలేని ఒక విచిత్రమయిన పరిస్థితుల్లో తెలంగాణా వైకాపా నేతలున్నారు. అగమ్యగోచరంగా ఉన్న పరిస్థితుల్లో ఉన్న వారు షర్మిల చేసే ఈ పరామర్శ యాత్రలతోనే సర్దిచెప్పుకోవలసి వస్తోంది.
ఈ వాదనను వైకాపా ఖండించవచ్చును. కానీ ఆమె చేసినా, రాహుల్ గాంధీ చేసినా ఆ యాత్రల పరామర్ధం మాత్రం అదే. తెలంగాణాలో వైకాపాతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. కనుక రాహుల్ గాంధీ చేసిన రైతు భరోసా యాత్ర వలన ఆ పార్టీకి ఎంతో కొంత ప్రయోజనం దక్కవచ్చును. కానీ తెలంగాణా అసలు జాడే కనబడని వైకాపాకి అప్పుడప్పుడు షర్మిల చేస్తున్న ఈ పరామర్శయాత్రల వలన ఏవిధంగా బలోపేతం అవుతుందో ఆ పార్టీ నేతలకే తెలియాలి. అయినా ప్రజాసమస్యలపై తెరాస రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడకుండా, తెరాసతో లోపాయికారిగా స్నేహం చేస్తూ, ఇటువంటి ఓదార్పు, పరామర్శ యాత్రలు ఎన్ని చేసినా వైకాపా తెలంగాణా ప్రజల విశ్వాసం పొందలేదని చెప్పవచ్చును. అటువంటప్పుడు ఇంత కష్టపడి పరామర్శ యాత్రలు ఎందుకు చేస్తున్నట్లు? అని ప్రశ్నించుకొంటే వరంగల్ ఉపఎన్నికలలో వైకాపా ఓటు బ్యాంక్ ని తెరాసకి మళ్ళించేందుకేనేమో అనే అనుమానం కలగడం సహజం. అదే నిజమయితే ఆమె పరామర్శయాత్రలన్నిటినీ ఎన్నికల షెడ్యుల్ తో సరిచూసుకోవలసి వస్తుంది. కానీ తెలంగాణాలో వైకాపాను నిజంగా బలోపేతం చేసుకోవాలంటే మాత్రం ఈ పరామర్శ యాత్రలు ఏవిధంగాను ఉపయోగపడవని ఖచ్చితంగా చెప్పవచ్చును.