ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలకు ..వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన కలుగుతోంది. వాటిని ఆపాలని నేరగా చంద్రబాబుకు లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబుకు శుభాకాంక్షలు చెబుతూ దాడులను ప్రస్తావించారు. వైసీపీ నేతలతో పాటు వైఎస్ విగ్రహాలపై దాడులు చేస్తున్నారని వీటిని ఆపాలన్నారు. గత ఐదేళ్లు వైసీపీ వాళ్లు చేసిన దారుణాలను చూసే.. ప్రజలు ఓడగొట్టారని ఇప్పుడు టీడీపీ అలాంటివి చేయకూడదని ఆమె అంటున్నారు.
వైఎస్ విగ్రహాలను ధ్వంసం చేయవద్దని కోరడం వరకూ బాగానే ఉంది కానీ.. వైసీపీ కార్యకర్తలపై దాడులు వద్దని చెప్పడానికి వెనుక ఏదో మతలబు ఉందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. దాడుల నుంచి రక్షణ కోసం వైసీపీ క్యాడర్ కాంగ్రెస్ లో చేరాలని ఆమె కోరుతోందన్నట్లుగా ఉందన్న సంకేతాలు వస్తున్నాయి. ఎలాగూ జగన్ వచ్చే కొద్ది రోజుల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కోబోతున్నారని ఇలాంటి సమయంలో ఆ పార్టీలో ఉండటం కన్నా.. మాతృపార్టీకి వచ్చేయడం మంచిదని ఆమె సంకేతాలు పంపుతున్నారని అంటున్నారు.
వైసీపీ వీక్ అయితే బలపడేది కాంగ్రెస్ పార్టీనే. వచ్చే కొద్ది రోజుల్లో కాంగ్రెస్ మరింత బలపడుతుందని ముస్లింలు, దళితులు ఏకపక్షంగా కాంగ్రెస్ వైపు నిలుస్తారన్న అంచనాలు వస్తున్నాయి. జగన్ ఇప్పటికీ బీజేపీకి మద్దతు పలుకుతూండటంతో .. కాంగ్రెస్ బలపడుతున్న సంకేతాలు వస్తే.. అందరూ తిరిగి వస్తారని భావిస్తున్నారు. షర్మిల రాజకీయం జగన్మోహన్ రెడ్డిని మించి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.