వైఎస్ అంటే కాంగ్రెస్ కు అమితమైన గౌరవం ఉందని.. సోనియా వైఎస్ కుటుంబానికి ఎలాంటి ద్రోహం చేయలేదని పంజాగుట్టలో వైఎస్ విగ్రహం సాక్షిగా షర్మిల స్ష్పష్టం చేశారు. చనిపోయిన తర్వాత కూడా సీబీఐ చార్జిషీట్ లో రాజీవ్ గాంధీ పేరు పెట్టారని తాము ఎంతో మథనపడ్డామని వైఎస్ చనిపోయాక ఆయన పేరు అక్రమాస్తుల కేసులో ఎందుకు పెట్టిస్తామని సోనియా చెప్పారని .. దీన్ని బట్టి తనకు అర్థమైందేమిటంటే.. అది తెలియక జరిగిన తప్పేనని షర్మిల తేల్చేశారు. షర్మిల మాటలు విన్న ఎవరికైనా మరి కాంగ్రెస్ కు.. సోనియాకు వైఎస్ ఫ్యామిలీ చేసిన ద్రోహం సంగతేమిటన్న ప్రశ్న వస్తుంది.
కాంగ్రెస్ లేకపోతే వైఎస్ లేడు. ఆయనను కాంగ్రెస్ హైకమాండ్ ప్రోత్సహించింది. జగన్ రెడ్డి విపరీతమైన అవినీతికి పాల్పడినట్లుగా.. పాల్పడుతున్నట్లుగా స్పష్టమైన ఆధారాలు కళ్ల ముందు ఉన్నా చూసీ చూడనట్లుగా వ్యవహరించారు. మీడియా సంస్థల్ని ఏర్పాటు చేసి విధేయతగా ఇందిర పేరు పెడితే ఆహో ఓహో అనుకున్నారు. చివరికి ఆయన చనిపోయాక అందరూ అడ్డం తిరిగి.. కాంగ్రెస్ పై, సోనియాపై దారుణమైన నిందలేసి సొంత కుంపటి పెట్టుకున్నారు. అక్రమ సంపాదనతోనే పార్టీని నడిపి .. కాంగ్రెస్ ను నామరూపాల్లేకుండా చేశారు.
ఇప్పుడు మళ్లీ అధికారంలో వాటా రాలేదని.. ఆస్తుల్లో వాటా ఇవ్వలేదని తేడాలు రావడంతో ఒకరు సోనియా పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా క్లీన్ చిట్స్ ఇస్తున్నారు. కానీ జగన్ రెడ్డి మాత్రం ఇప్పటికీ.. పాత అభిప్రాయాలతోనే ఉన్నారు. కాంగ్రెస్ పై బండలేస్తూనే ఉన్నారు. ఆయనకు ఎప్పుడు అవసరం వస్తుందో కానీ అప్పుడు కూడా ఇలాంటి ప్రకటనలు చేయడానికి రెడీగా ఉంటారు. తమ రాజకీయం కోసం తాము చేసే నేరాల్ని ఎదుటి వారిపై అసువుగా చల్లేసే సహజ సిద్ద రాజకీయ నేతలు.. అవసరం వచ్చినప్పుడు వెంటనే మాట మార్చేస్తారు. షర్మిలను చూస్తే అదే ఎవరికైనా గుర్తుకు వస్తుంది.